Loading...
Telangana: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Telangana: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కామారెడ్డి జిల్లాలో 6.9 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వివరాలు 

26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు

కొంతకాలంగా వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి.

మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గింది.

జూన్, జులై నెలల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం లోటు నమోదైంది. దీంతో రాష్ట్రంలోని సుమారు 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాలు 

గోదావరిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

ఇదిలా ఉండగా, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతోంది.

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపు నిండుకుండలను తలపిస్తున్నాయి.

సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

అయితే శ్రీశైలం జలాశయానికి కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే చేరుతోంది.

మరోవైపు, మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

ADVERTISEMENT