Pawan kalyan: ఉగాది నుంచి 'పచ్చదనం' ప్రాజెక్టు: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ని 50 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అంకితభావంతో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను ఉగాది నాటికి సిద్ధం చేసి, అదే రోజు నుంచి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు.
వివరాలు
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యం
పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే రకమైన మొక్కలను నాటే దిశగా చర్యలు చేపట్టాలని, తీరప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో స్వదేశీ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మొత్తం భూభాగంలో 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 30 శాతం పచ్చదనం మాత్రమే ఉండగా, 2030 నాటికి 37 శాతం గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని వెల్లడించారు. ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే 9 లక్షల హెక్టార్లలో చెట్లు పెంచాల్సి ఉంటుందని వివరించారు.
వివరాలు
రాష్ట్రంలో ఉన్న తీరప్రాంతాల్లో సుమారు 40 శాతం అటవీశాఖ పరిధిలో..
ఈ మొత్తం ప్రణాళికలో ఉద్యానశాఖ 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట చేపడుతున్న వృక్షారోపణ కార్యక్రమాల తరహాలోనే రాష్ట్ర రహదారుల వెంట కూడా చెట్లు నాటే విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న తీరప్రాంతాల్లో సుమారు 40 శాతం అటవీశాఖ పరిధిలో ఉందని, మిగిలిన ప్రాంతాల్లో అవసరమైన ప్రణాళికలను ఆయా శాఖలు రూపొందించి అమలు చేయాలని పవన్‌కల్యాణ్ సూచించారు. అలాగే రైతుల భూముల్లో దీర్ఘకాలిక లాభాలు అందించే పండ్ల తోటలను ప్రోత్సహించాలని తెలిపారు.
వివరాలు
బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రితో చర్చిస్తా: పవన్
ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఫిబ్రవరి 5న జరిగే తదుపరి సమావేశానికి అన్ని శాఖల అధికారులు స్పష్టమైన, అమలుచేయదగిన ప్రణాళికలతో హాజరుకావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కాంతిలాల్ దండే, శశిభూషణ్ కుమార్, కృష్ణబాబు, రాజశేఖర్, అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పీ.వి. చలపతిరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రంజిత్ భాషా, ఏపీఐఐసీ ఉపాధ్యక్షుడు, ఎండీ అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.