
Andhra News: జగన్ పర్యటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
పోలీసులు నిర్దేశించిన మార్గాన్ని తప్పించి వేరే మార్గంలో వెళ్లడం, వాహనాల శ్రేణిని తరచూ ఆపడం, లేదా భారీగా జనసమీకరణ జరిపితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించినా, రాజకీయ హోదా లేదా పార్టీ సంబంధం అనే భేదం లేకుండా, చట్టపరమైన క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంలో పోలీసులు "జీరో టాలరెన్స్" విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని తెలిపారు. జగన్ నర్సీపట్నం పర్యటనకు సంబంధించి, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30, 30ఎ ప్రకారం, నిర్దేశించిన మార్గం, సమయం, ప్రయాణ పరిమితి ఆధారంగా మాత్రమే అనుమతి ఇచ్చినట్లు డీజీపీ పేర్కొన్నారు.
వివరాలు
పోలీసు భద్రతా ఏర్పాట్లు ప్రజల రక్షణ కోసం మాత్రమే..
జగన్ ప్రయాణించే మార్గంలో ఎవరైనా ఊరేగింపులు,ర్యాలీలు, ప్రదర్శనలు లేదా భారీ జన సమీకరణలు చేయరాదని పోలీసులు నిషేధించారు. అనుమతించిన ప్రాంతం తప్ప ఇతర ప్రదేశాల్లో రాజకీయ నినాదాలు, స్వాగతాలు లేదా సభలు నిర్వహించడం కూడా నిషేధం. కార్యకర్తలను సమీకరించడం, ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, లేదా రహదారులపై రద్దీ సృష్టించడం చట్ట ఉల్లంఘనలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అనుమతి లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. పోలీసు భద్రతా ఏర్పాట్లు ప్రజల రక్షణ కోసం మాత్రమే అని తెలిపారు. అలాగే, పర్యటన సందర్భంగా ఏదైనా ప్రమాదం లేదా ఆస్తి నష్టం జరిగితే, ఆ బాధ్యత నిర్వాహకులదేనని, ఇందుకు వారు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని చెప్పారు.
వివరాలు
18 నిబంధనలు, 10 వాహనాలు
జగన్‌మోహన్ రెడ్డి గురువారం జరపనున్న నర్సీపట్నం పర్యటనకు సంబంధించి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పోలీసులు మొత్తం 18 నిబంధనలతో అనుమతులు మంజూరు చేశారు. ఆయన కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు స్పష్టంచేశారు. ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందించారు. ఆ మ్యాప్‌లో సూచించిన మార్గాన్నే తప్పకుండా అనుసరించాలనీ, వేరే మార్గాల్లో ప్రయాణించరాదని విశాఖ సిటీ పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పర్యటన సందర్భంగా ఏదైనా ప్రాణనష్టం లేదా ప్రభుత్వ ఆస్తికి నష్టం సంభవించినా, దానికి నిర్వాహకులదే వ్యక్తిగత బాధ్యత అని వారు స్పష్టంగా పేర్కొన్నారు.