Dharmendra Pradhan: నీట్ అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా.. ధైర్యంగా పరీక్ష రాయండి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ధైర్యంగా పరీక్షకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధిస్తారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ), రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరికొన్ని గంటల్లో లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్న నేపథ్యంలో, తప్పుడు వార్తలు ప్రచారం చేసి అభ్యర్థులను ఆందోళనకు గురిచేయవద్దని ఆయన కోరారు.
వివరాలు
ప్రశాంతంగా ఉండండి.. మీకు మేమున్నాం: ఎన్‌టీఏ
పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నీట్ పునఃపరీక్ష సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కూడా అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ పరిస్థితులను ముందుగానే పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని సూచించింది. ప్రశాంతంగా పరీక్ష రాయాలని విద్యార్థులకు సూచించింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు (ఐడీ ప్రూఫ్), రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని పేర్కొంది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
వివరాలు
కట్టుదిట్టమైన భద్రత మధ్య రీటెస్ట్
ఆ సమయం దాటిన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు సహా పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన నేపథ్యంలో, పునఃపరీక్షను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను కూడా మోహరించి బందోబస్తు కల్పించారు.