Dharmendra Pradhan: సీబీఎస్ఈ మూల్యాంకనంలో భారీ మార్పులు.. పూర్తిగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాల పరిశీలన
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. క్లాస్-12 పరీక్షలకు హాజరైన దాదాపు 17 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పరిశీలించినట్లు తెలిపారు. మొత్తం 98 లక్షల ఆన్సర్ స్క్రిప్టులను స్కాన్ చేసి, 40 కోట్లకు పైగా పేజీలను 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' విధానంలో మూల్యాంకనం చేసినట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుందని, ప్రపంచంలోని అనేక విద్యాసంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. రీ-వాల్యుయేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు తమ స్కాన్ చేసిన జవాబు పత్రాలను నేరుగా చూసుకునే సదుపాయం కల్పించామని చెప్పారు.
వివరాలు
ఐఐటీ కాన్పూర్,ఐఐటీ మద్రాస్ సంస్థలు సాంకేతిక సహకారం
మార్కుల విషయంలో సందేహాలు ఉంటే ప్రశ్నించే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు తమ ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోగా, దాదాపు 11 లక్షల కాపీలు పరిశీలించినట్లు వివరించారు. ఈ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ పర్యవేక్షణకు ఐఐటీ కాన్పూర్,ఐఐటీ మద్రాస్ సంస్థలు సాంకేతిక సహకారం అందించాయని తెలిపారు. చెల్లింపుల సౌకర్యం కోసం ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌ల చెల్లింపు విధానాలను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ప్రక్రియలో కొన్ని లోపాలు గుర్తించిన విషయాన్ని అంగీకరించిన కేంద్రం.. వాటిపై పూర్తి బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒక్క విద్యార్థి ఫిర్యాదు కూడా పెండింగ్‌లో ఉండకుండా పరిష్కరిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు.