Aadhaar Card: మీకు తెలుసా? ఆధార్ కార్డు పుట్టిన తేదీకి ప్రూఫ్ కాదట… అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ కార్డ్ వినియోగంపై భారతదేశ ప్రత్యేక గుర్తింపు అథారిటీ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది. వినియోగదారులు, వివిధ ఏజెన్సీలు పెట్టుకున్న అంచనాలపై సంచలన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్‌ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణించాలని, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ (DOB) నమోదు ఉన్నప్పటికీ, దాన్ని అధికారిక జనన తేదీ ధృవీకరణ పత్రంగా అంగీకరించరాదని UIDAI ఆధార్ యూజర్ ఏజెన్సీలు (AUA), ఈ-కేవైసీ యూజర్ ఏజెన్సీలకు (KUA) లేఖ ద్వారా తెలియజేసింది.
వివరాలు
పుట్టిన తేదీ ప్రూఫ్‌గా ఎందుకు కాదంటే?
ఆధార్ అనేది వ్యక్తి గుర్తింపును (Identity) ధృవీకరించడానికి మాత్రమే రూపొందించబడిన వ్యవస్థ అని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ నమోదు సమయంలో వ్యక్తి సమర్పించే పత్రాలు—స్కూల్ సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ వంటి వాటి ఆధారంగా పుట్టిన తేదీ నమోదు చేస్తారు. ఒకవేళ సరైన పత్రాలు లేకపోతే, వయసు అంచనా ఆధారంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ సంవత్సరంలోని జనవరి 1ని పుట్టిన తేదీగా నమోదు చేస్తుంది. అందువల్ల ఇది ఎప్పుడూ కచ్చితమైన పత్రం కాదని సంస్థ పేర్కొంది.
వివరాలు
గుర్తింపు మాత్రమే ధృవీకరిస్తుంది
ఆధార్ కార్డు ఆధారంగా వ్యక్తి బయోమెట్రిక్ డేటా ద్వారా అతను అసలైన వ్యక్తి కాదా అన్నది మాత్రమే నిర్ధారిస్తారు. సెంట్రల్ డేటాబేస్‌తో సమాచారం సరిపోల్చి గుర్తింపును ధృవీకరిస్తారు కానీ పుట్టిన తేదీని వెరిఫై చేయరు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు లేదా ఇతర సేవల్లో పుట్టిన తేదీ ఆధారంగా ఆధార్‌ను ఉపయోగించాలా వద్దా అనే విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత ఏజెన్సీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని UIDAI తెలిపింది.
వివరాలు
ఆధార్ ఏ రూపంలో చెల్లుతుంది?
ఆధార్ కార్డు అన్ని రూపాలు—ఫిజికల్ కార్డ్, ఈ-ఆధార్, మాస్క్డ్ ఆధార్, ఆఫ్‌లైన్ XML, QR కోడ్—అన్నీ గుర్తింపు (ID Proof) మరియు చిరునామా (Address Proof) కోసం చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. దీంతో ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ వంటి అధికారిక పత్రాలు మాత్రమే ప్రామాణికంగా పరిగణించబడనున్నాయి.