Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలు.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ విధానంలో కేసుల విచారణను వేగంగా, సమర్థంగా నిర్వహించేందుకు, మొదటి దశలో కాగితాలను డిజిటలైజ్ చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో నల్గొండ, వరంగల్ జిల్లాల కోర్టులు, గ్రేటర్ హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టును ఎంపిక చేశారు. ఈ డిజిటలైజేషన్ ప్రాజెక్టుకు అవసరమైన టెండర్లు పూర్తయ్యాయి. మరికొన్నింటికి అనుమతులు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ప్రక్రియను ఆరు నుండి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు.
త్వరలోనే రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల కోర్టుల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి..
డిజిటలైజేషన్ పూర్తయ్యాక, కాగిత రహిత డిజిటల్ న్యాయసేవలను అందించడానికి సిద్ధమవుతున్నారు. మొదటగా నల్గొండ, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుల్లో ఈ సేవలను ప్రారంభిస్తారు, తరువాత నగరంలోని మిగిలిన కోర్టులు, అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కోర్టుల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కుటుంబ కోర్టులు ఏర్పాటవుతున్న తరుణంలో అధికారులు పూర్తి స్థాయి డిజిటల్ సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటగా హైబ్రిడ్ విధానంలో డిజిటల్ సేవలు అందించి, ప్రజలకు పరిచయం చేసిన అనంతరం, పూర్తిస్థాయిలో డిజిటల్ సేవలు అందించబడతాయి.