
Kadapa Mayor Disqualified: కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
ఈ వార్తాకథనం ఏంటి
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ వేడి ఉపందుకుంది. మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం స్థానిక రాజకీయాల్లో చర్చలకు కారణమైందని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణలో మేయర్ తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించారని తేలింది. వర్ధిని సంస్థలో కొత్తమద్ది అమరేష్, కొత్తమద్ది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్1955 సెక్షన్ 22(1)ప్రకారం, మేయర్ నేరుగా గానీ, కుటుంబ సభ్యుల ద్వారా గానీ కార్పొరేషన్ కాంట్రాక్టు పనులు చేయడం నిషేధించబడింది. యాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తే, ప్రజా ప్రతినిధులు తమ పదవికి అనర్హులు అవుతారు. ఈనేపథ్యంలో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Details
రాజకీయ కుట్ర అని అరోపిస్తున్న వైసీపీ
అయితే వైసీపీ పార్టీ ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తోంది. వైఎస్ కుటుంబానికి 25ఏళ్లుగా కడప కార్పొరేషన్‌పై ఆధిపత్యం ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు, వారి కుటుంబం మున్సిపల్ పాలనలో ప్రభావం చూపుతూ వస్తోంది. 2006లో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పటి నుంచి మూడు పర్యాయాల మేయర్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం సూచించిన వ్యక్తులే మేయర్‌గా కొనసాగుతున్నారు. కొత్తమద్ది సురేష్ బాబు రెండు సార్లు మేయర్ పదవి చేపట్టారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యేతో జరిగిన కుర్చీ గొడవకు కారణంగా ఆయన కుర్చీకి ఎసరు తగలిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. 25 సంవత్సరాల తర్వాత టీడీపీ అభ్యర్థి కడపలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Details
మాధవి తీవ్ర విమర్శలు
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎమ్మెల్యేలు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవి, మున్సిపల్ సమావేశంలో హాజరై సాఫీగా ప్రారంభించగా, రెండవ సమావేశంలో గందరగోళం మొదలైంది. 2024 నవంబర్ 7న జరిగిన సమావేశంలో మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవి కోసం సీటు కేటాయించలేదు. మాధవి ఆగ్రహంతో మేయర్‌ను ప్రశ్నించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఫిర్యాదులు సృష్టించాయి. డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో కూడా అవినీతి, అక్రమాలపై మాధవి తీవ్ర విమర్శలు చేసింది. ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదు చేసిన తర్వాత, విజిలెన్స్ విచారణలో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని నిర్ధారించారు.
Details
గడువు పెంచాలని అభ్యర్థన
మార్చి 28న షోకాజ్ నోటీసు జారీ చేశారు, అందుకు సమాధానం ఇవ్వమని పేర్కొన్నారు. సురేష్ బాబు హైకోర్ట్‌ను ఆశ్రయించి సమాధానానికి గడువును పెంచవలసిందని అభ్యర్థించారు. హైకోర్టు రెండుసార్లు గడువును పెంచింది; మూడవసారి విచారణ హాజరుకావాలని ఆదేశించింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం, సురేష్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మేయర్ పదవి నుంచి తొలగించబడ్డట్లు ఈ గెజిట్ నోటిఫికేషన్ కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు చేరింది.