LOADING...
Cyclone Ditwah: తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు 
కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు

Cyclone Ditwah: తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ భారత తీరాన్ని ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి వైపు ఉత్తర దిశగా కదులుతూ రెండు రోజులుగా తీరప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేసిన దిత్వా తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండ స్థాయికి బలహీనపడింది. సోమవారం ఉదయానికి ఇది మరింత తగ్గిపోయి సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంపై వర్షాల ప్రభావం కూడా క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్‌ అంతటా ముసురు వాతావరణం నెలకొని, పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ స్థాయి వరకూ వర్షాలు నమోదయ్యాయి.

వివరాలు 

రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 

ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 88.75 మిల్లీమీటర్లు, జలదంకిలో 56.25 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా చిట్టమూరులో 32.75 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తీవ్రమైన వాయుగుండ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. తీరప్రాంతాల వెంట గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు సముద్రం అలజడిగా మారనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.

వివరాలు 

 ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించిన హోంమంత్రి

అలాగే అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, తూర్పు గోదావరి,ఏలూరు,ఎన్టీఆర్,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆదివారం ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

వివరాలు 

 రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న తుపాను

అదే సమయంలో దిత్వా తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. మరోవైపు తుపాను ప్రభావం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఆరు నెలల కష్టానికి ఫలితంగా పండించిన పంట ఎక్కడ వర్షాలకు దెబ్బతింటుందోనన్న భయంతో వరి పంట పూర్తిగా పక్వానికి రాకపోయినా ముందస్తుగా కోతలు చేపడుతున్నారు.

Advertisement

వివరాలు 

రైతులు రాత్రి వేళల్లోనే హార్వెస్టర్లతో పొలాల్లో పంటను కోయించుకోవాల్సిన పరిస్థితి

ఒక్కసారిగా పంట కోత పనులు ఊపందుకోవడంతో కూలీలు, హార్వెస్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో ఎకరాకు సుమారు రూ.2,500గా ఉన్న యంత్రాల ఛార్జీ ప్రస్తుతం రూ.4,000కు పైగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. యంత్రాలు, కూలీల కొరత కారణంగా చాలామంది రైతులు రాత్రి వేళల్లోనే హార్వెస్టర్లతో పొలాల్లో పంటను కోయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొలుగుమట్టి నాగేశ్వరరావు కూడా రాత్రిపూట పంట కోత చేపట్టారు. ఇలా వర్షాల ముప్పు నుంచి పంటను కాపాడుకునేందుకు పలువురు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతూ పొలాల్లోనే కాపలా కాస్తున్నారు.

Advertisement