Divyang Shakti Scheme: నేడు 'దివ్యాంగ శక్తి' ప్రారంభం.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఇవాళ ఉదయం 11:30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 'దివ్యాంగ శక్తి' కింద రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నారు. ముఖ్యంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తించనుంది.
Details
సుమారు రూ.207 కోట్ల వ్యయం
ఇప్పటివరకు అమలులో ఉన్న నాలుగు వర్గాల దివ్యాంగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు విస్తరించడం ఈ పథకంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు. 'దివ్యాంగ శక్తి' అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.207 కోట్ల వ్యయం చేయనున్నట్లు అంచనా వేస్తోంది.
Details
ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పథకం ప్రారంభోత్సవం కోసం సీఎం చంద్రబాబు ఉదయం 11:15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 11:30 గంటలకు మంగళగిరి ఆర్టీసీ బస్ స్టాండ్‌కు చేరుకుంటారు. అనంతరం 11:35 గంటలకు పథకాన్ని ప్రారంభించి, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించనున్నారు.