LOADING...
DK Shivakumar: జూన్‌ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!
జూన్‌ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

DK Shivakumar: జూన్‌ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం వచ్చే బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త మంత్రివర్గంలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడికి కూడా స్థానం లభించే అవకాశం ఉందని సమాచారం.

వివరాలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమే

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శుక్రవారం ఆమోదించారు. దీంతో శనివారం జరగనున్న సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్‌ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు

సగం మందికి కొత్త కేబినెట్‌లో అవకాశం

ఇదిలా ఉండగా, రాజీనామా అనంతరం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య కొత్త మంత్రివర్గానికి సంబంధించిన తన ప్రతిపాదిత మంత్రుల జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పరిశీలన కోసం సమర్పించినట్లు సమాచారం. తన కుమారుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు కేటాయించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో దాదాపు సగం మందికి కొత్త కేబినెట్‌లో అవకాశం దక్కకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement