Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ట్రాప్ చేస్తున్నారు: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థులు తమకు చెప్పారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందన్న విశ్వాసాన్ని డీకే శివకుమార్ వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇక్కడికి వచ్చిన తమకు సహాయంగా ఉన్నారని, ఇప్పుడు తాము కూడా అక్కడికి వెళ్తామన్నారు. ఫలితాల తర్వాత ఏమి జరుగుతుందో తెలియదని, అయితే ఇప్పటి వరకు అయితే తాము నమ్మకంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో చేరుతుతామంటూ ఫోన్ చేస్తున్నారు: రేణుకా చౌదరి
కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్‌కు భిన్నంగా రేణుకా కామెంట్స్ చేయడం గమనార్హం. ఎన్నికల అంచనాలను చూసి చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతామంటూ తనకు కాల్స్ వచ్చాయన్నారు. గతంలో బీఆర్ఎస్ తమ 12మంది ఎమ్మెల్యేలను తీసుకుందని, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఓట్ల శాతం 42 శాతం, బీఆర్‌ఎస్ 36శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏఐఎంఐఎంకు 3 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నాయి. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి గురువారం పోలింగ్ జరగ్గా, రాష్ట్రంలో 71.34 శాతం ఓటింగ్ నమోదైంది.