LPG: ఎల్పీజీకి బదులుగా డీఎంఈ.. నూతన ఇంధనంపై ఐఐసీటీ కీలక అడుగు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ లో చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. డై మిథైల్ ఈథర్ (DME) అనే ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అభివృద్ధి చేసే దిశగా సంస్థ ముందడుగు వేస్తోంది. ఈ సాంకేతికత ఆధారంగా పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. ఈ వివరాలను ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Details
డై మిథైల్ ఈథర్ తయారీ ఎలా?
పరిశ్రమల నుంచి విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌ను వినియోగించి డై మిథైల్ ఈథర్‌ను తయారు చేయవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (India) సహకారంతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)తో కలిసి ఐఐసీటీ ఈ వినూత్న ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఐఐసీటీ రూపొందించిన ప్రత్యేక ఉత్ప్రేరకాల సహాయంతో డీఎంఈ ఉత్పత్తి జరుగుతుంది. వచ్చే ఏడాది నాటికి పైలట్ ప్రాజెక్ట్‌లో రోజుకు సుమారు 180 కిలోల డీఎంఈ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం డీఎంఈ ఉత్పత్తి ప్లాంట్‌తో పాటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Details
డీఎంఈ ప్రయోజనాలు
డై మిథైల్ ఈథర్ లక్షణాలు ప్రస్తుతం వాడుతున్న ఎల్పీజీలో ఉండే ప్రొపేన్, బ్యూటేన్ వాయువులకు సమానంగా ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న గ్యాస్ వ్యవస్థల్లో పెద్ద మార్పులు చేయకుండా దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు, బర్నర్లు, పంపిణీ వ్యవస్థల్లో పెద్దగా మార్పులు చేయకుండానే ఎల్పీజీతో కలిపి 20 శాతం వరకు డీఎంఈని వినియోగించవచ్చు. డీజిల్‌కు కూడా ఇది ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగపడే అవకాశముంది. ఈ సాంకేతికత విజయవంతమైతే టెక్నాలజీ బదలాయింపు ద్వారా దేశీయంగానే భారీ స్థాయిలో డీఎంఈ ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా దేశ ఇంధన భద్రత కూడా బలోపేతం అవుతుంది.
Details
పుణెలో మిథనాల్ నుంచి ఉత్పత్తి
CSIR-జాతీయ రసాయన ప్రయోగశాల (ఎన్‌సీఎల్), పూణేలో ఇప్పటికే మిథనాల్ నుంచి డై మిథైల్ ఈథర్‌ను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అక్కడ రోజుకు 250 కిలోల డీఎంఈ ఉత్పత్తి చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని రోజుకు 2.5 టన్నులకు పెంచే ప్రణాళికలు ఉన్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా డీఎంఈను ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా అని కూడా ఆయన చెప్పారు.
Details
వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి
ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా వ్యర్థాల నుంచి వంట గ్యాస్‌ను తయారు చేసే అనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ సాంకేతికతను కూడా ఐఐసీటీ అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రధాన శాస్త్రవేత్త ఎ. జి. రావు తెలిపారు. ఈ సాంకేతికతను ఇప్పటికే బోవెన్‌పల్లి మార్కెట్, గుడిమల్కాపూర్ మార్కెట్, ఎర్రగడ్డ మార్కెట్, కూకట్‌పల్లి మార్కెట్, బాటసింగారం మార్కెట్లతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ మహిళా హాస్టల్, అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటి సంస్థలు వినియోగిస్తున్నాయి. ఐఐసీటీలో ఏర్పాటు చేసిన రోజుకు 250 కిలోల సామర్థ్యం గల ప్లాంట్ ద్వారా సంస్థ అవసరాల్లో సుమారు 25 శాతం వరకు గ్యాస్ అందుతోందని తెలిపారు. ఒక టన్ను వ్యర్థాల నుంచి నాలుగు ఎల్పీజీ సిలిండర్లకు సమానమైన బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఆయన వివరించారు.