Kumki Elephants: కుంకీ ఏనుగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఏనుగుల అభయారణ్యంలో ఉన్న కుంకీ ఏనుగులపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏనుగుల సంరక్షణ, పరిరక్షణతో పాటు శాస్త్రీయ అధ్యయనాల కోసం ఇటీవల రెండు రోజుల క్రితం వాటి రక్త నమూనాలను సేకరించి దేహ్రాదూన్‌లోని వన్యప్రాణి పరిశోధనా సంస్థకు పంపించారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి ఏనుగుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక గుర్తింపు కార్డును అమర్చనున్నారు. ఇది ఆధార్ కార్డు తరహాలో ఉపయోగపడుతుంది. ఈ వివరాల ద్వారా ఏనుగుల్లో ఉండే జన్యుపరమైన సమస్యలను గుర్తించి తగిన వైద్యం అందించడమే కాకుండా వాటి ఆరోగ్య స్థితిని సమగ్రంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది.
వివరాలు
కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు
భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా అన్ని వివరాలు ఒకచోట ఉండేలా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు అటవీ విభాగాధికారి సుబ్బరాజు వెల్లడించారు. కర్ణాటక నుంచి జయంత్, రంజన్, అభిమన్యు, కృష్ణ, దేవ, వినయ్ అనే ఆరు కుంకీ ఏనుగులను ఇక్కడికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇవన్నీ పలమనేరు శిబిరంలోనే ఉన్నాయి. అడవిలోని ఏనుగులు గ్రామాల వైపు రాకుండా వాటిని మళ్లించేందుకు వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు రెండు సార్లు ఏనుగులను సురక్షితంగా మళ్లించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.