కారు పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు ఇక్కట్లు.. తొలగించాలంటూ దిల్లీ హైకోర్టును అశ్రయించిన పార్టీ
కారును పోలిన గుర్తులు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ దిల్లీ హైకోర్టును కోరింది. తమ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయిస్తే తమ పార్టీకి తీరన నష్టం జరుగుతుందని, ముఖ్యంగా వృద్ధులు ఆ గుర్తును కారుగా భ్రమపడి వాటికే వేస్తారని బీఆర్ఎస్ హైకోర్టును అశ్రయించింది. కారు పోలిన గుర్తులను ఏ పార్టీకి కేటాయించకూడదని కోరతూ బీఆర్ఎస్ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే.
బీఆర్‌ఎస్ విజ్ఞప్తులపై స్పందించని కేంద్ర ఎన్నికల సంఘం
రోడ్‌రోలర్, కెమెరా, చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయిస్తే బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అయితే బీఆర్‌ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై నేడు విచారణ చేపట్టనుంది.