Karnataka: ధార్వాడ్‌లో దారుణం.. ఇంట్లో అనస్థీషియా వైద్యుడి హత్య,8 ఏళ్ల కొడుక్కి కత్తిపోట్లు.. పోలీసుల అదుపులో భార్య
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని ధార్వాడ్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల అనస్థీషియా వైద్యుడు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, వృత్తిరీత్యా కంటి వైద్యురాలైన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాలు
బంధువులకు అనుమానం.. ఇంటికి వెళ్లి చూసే సరికి విషాదం
డాక్టర్ కిరణ్ ధార్వాడ్‌లోని చిరాయు ఆసుపత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్నారు.
ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, కుమారుడితో కలిసి ఓ సెక్యూర్డ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.
గురువారం కిరణ్‌కు కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేయగా, ప్రియాంక నుంచి స్పష్టత లేని సమాధానాలు వచ్చాయి.
కిరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని, అనంతరం బయటకు వెళ్లారని ఆమె చెప్పడంతో బంధువులకు అనుమానం కలిగింది.
దీంతో సాయంత్రం వారు నేరుగా అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న కిరణ్ మృతదేహాన్ని గుర్తించారు.
మరో గదిలో కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
చిన్నారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అప్పటికీ చిన్నారి ప్రాణాలతో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్య, భర్త, కుమారుడు మాత్రమే ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
బయట వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని వెల్లడించారు.
వివరాలు
కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు
ప్రస్తుతం డాక్టర్ ప్రియాంక తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని, విచారణలో ఆమె నుంచి పొంతనలేని సమాధానాలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే, కిరణ్ హత్యకు ప్రియాంకే కారణమని బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు.
సబర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
అలాగే పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, పూర్తిస్థాయి విచారణ అనంతరమే హత్యకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.