
Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు బెదిరింపులు.. బెంగళూరు వైద్యురాలు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ మహిళా డాక్టర్ విమాన ప్రయాణ సమయంలో అసభ్యంగా ప్రవర్తించి హద్దులు దాటిన ఘటన కలకలం రేపుతోంది.
విమాన సిబ్బంది పలు మార్లు హెచ్చరించినా, ఆమె తీరు మారకపోవడంతో, చివరికి 'విమానాన్ని క్రాష్ చేస్తా' అంటూ బెదిరింపులకు దిగింది.
ఈ నేపథ్యంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
వెంటనే స్పందించిన పోలీసులు బెంగళూరుకు చెందిన వైద్యురాలు వ్యాస్ హిరల్ మోహన్‌భాయ్‌ను అరెస్టు చేశారు.
ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జరిగింది.
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX2749) తుది ఏర్పాట్లలో ఉంది.
వివరాలు
విమానాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులు
అదే విమానంలో 36 ఏళ్ల హిరల్ మోహన్‌భాయ్ ఎక్కింది. ఆమె తన లగేజిని మొదటి వరుసలో వదిలేసి, సీటు నంబర్ 20ఎఫ్ వద్ద కూర్చొంది.
దీనిని గమనించిన సిబ్బంది, సామాన్లను సంబంధిత ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచాలని సూచించారు.
అయితే ఆమె దీనికి అంగీకరించకుండా వారిపై ఆగ్రహంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది.
ఆమె ప్రవర్తనతో సహ ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. పైలట్ కూడా జోక్యం చేసుకున్నా, ఆమె తీరులో మార్పు రాలేదు.
అంతటితో ఆగకుండా విమానాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు దిగింది.
దీంతో పైలట్, సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వెంటనే స్పందించి ఆ మహిళను విమానంలో నుంచి దించేశారు.
వివరాలు
పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు
ఆమె ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆమెను బయటకు పంపించామని వర్గాలు తెలియజేశాయి.
సమాచారం మేరకు ఆమె బెంగళూరులోని యలహంక సమీపంలోని శివనహళ్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, భారతీయ న్యాయ శిక్షాసమితి సెక్షన్ 351 (4).. అజ్ఞాత కమ్యూనికేషన్ ద్వారా నేరపూరిత బెదిరింపు, 353 (1)(బి).. ప్రజా దుష్ప్రవర్తన ప్రకటనలపై, అలాగే పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాల అణచివేత చట్టంలోని సెక్షన్ 3(1)(ఎ).. విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తిపై హింసాత్మక చర్యలకు పాల్పడిన కేసులు నమోదు చేశారు.
అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.