LOADING...
PM Modi: ఏడాది పాటు గోల్డ్ కొనొద్దా?.. ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక అసలు కథ ఇదే!
ఏడాది పాటు గోల్డ్ కొనొద్దా?.. ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక అసలు కథ ఇదే!

PM Modi: ఏడాది పాటు గోల్డ్ కొనొద్దా?.. ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక అసలు కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భావోద్వేగానికి, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ఏవైనా పసిడి లేకుండా పూర్తి కావన్న భావన దేశవ్యాప్తంగా బలంగా ఉంది. అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఏడాది పాటు పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని లేదా వాయిదా వేసుకోవాలని ఆయన ప్రజలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంతటి బంగారు మక్కువ ఉన్న దేశంలో ప్రధాని ఇలా ఎందుకు సూచించారన్నదానిపై చర్చ మొదలైంది.

వివరాలు

బంగారం కొనుగోళ్లు - విదేశీ మారక నిల్వలపై ప్రభావం

భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది సుమారు 700 నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడే దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ప్రారంభమవుతోంది. ఎందుకంటే దిగుమతి చేసుకునే ప్రతి గ్రాము బంగారానికి అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏటా 35 నుంచి 45 బిలియన్ డాలర్ల వరకు కేవలం బంగారం దిగుమతులకే ఖర్చవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు 3,000 డాలర్లను దాటడంతో ఈ భారం మరింత పెరిగింది.

వివరాలు

ముడి చమురు ధరల పెరుగుదలతో అదనపు ఒత్తిడి

ఇప్పటికే బంగారం దిగుమతులు భారీగా ఉండగా.. మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరినట్లు సమాచారం. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు అత్యవసరం కాగా, బంగారం కొనుగోలు మాత్రం తప్పనిసరి అవసరం కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం చేసే బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేస్తే దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు.

Advertisement

వివరాలు

కరెంట్ ఖాతా లోటు అంటే..?

దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసే ప్రధాన సూచికల్లో కరెంట్ అకౌంట్ ఒకటి. దేశం ఎగుమతుల ద్వారా సంపాదించే విదేశీ మారక ద్రవ్యంకంటే దిగుమతుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. ఈ లోటు అధికమైతే రూపాయి విలువ పడిపోవడం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

Advertisement

వివరాలు

పెళ్లి బంగారంపైనే ఎందుకు ఫోకస్..?

భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 10 నుంచి 12 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఉండే పెళ్లిళ్ల సీజన్‌లోనే అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. అందుకే ఈ కొనుగోళ్లను తాత్కాలికంగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి నిషేధం కాదని, కేవలం దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేసిన నైతిక విజ్ఞప్తి మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఖర్చులను నియంత్రిస్తే విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

గతంలోనూ ఇలాంటి పరిస్థితులే

2013లో కూడా భారత్‌ ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ సమయంలో ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాలు పెంచడంతో పాటు 80:20 పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కూడా భౌతిక బంగారం కొనుగోళ్లకు బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ఆర్థిక సాధనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

జువెలరీ మార్కెట్‌పై ప్రభావం..?

ప్రధాని వ్యాఖ్యల ప్రభావం జువెలరీ రంగంపై కొంత మేర పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తనిష్క్‌, కళ్యాణ్ జ్యువెలర్స్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లపై తాత్కాలికంగా సెంటిమెంట్ ప్రభావం కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయులకు బంగారంపై ఉన్న భావోద్వేగ అనుబంధం దృష్ట్యా డిమాండ్ పూర్తిగా తగ్గిపోదని, కేవలం కొంతకాలం వాయిదా పడే అవకాశమే ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ చేసిన ఈ పిలుపును ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement