Asaduddin Owaisi: 'చరిత్రను వక్రీకరించొద్దు'.. మాలేగావ్ వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో మాలేగావ్‌లో చోటుచేసుకున్న 'టిప్పు సుల్తాన్' ఫోటో వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసింది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో ఏర్పాటు చేయడం వివాదానికి కేంద్రబిందువైంది. ఈ చర్యపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్ష వర్ధన్ సప్కల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రగిలించాయి. సప్కల్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్‌ను ఛత్రపతి శివరాజ్ పోల్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు.
Details
టిప్పు సుల్తాన్ పోరాడుతూ అమరుడయ్యారు
ఈ వివాదంలో అసదుద్దీన్ ఒవైసీ కూడా జోక్యం చేసుకున్నారు. టిప్పు సుల్తాన్‌ను అమరవీరుడిగా అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ఓవైసీ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో పోరాడుతూ అమరుడయ్యారు. వినాయక్ దామోదర్ సావర్కర్ చేసినట్లుగా ఆయన బ్రిటిష్ వారికి ప్రేమలేఖలు రాయలేదు, క్షమాపణలు కోరలేదు. టిప్పు తన కత్తితో దేశ విముక్తి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన వేలి నుంచి తీసిన ఉంగరంపై 'రామ్' అనే పదం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత క్షిపణి, రాకెట్ సాంకేతికతలు టిప్పు కలలను నిజం చేస్తున్నాయని అబ్దుల్ కలాం తన రచన వింగ్స్ ఆఫ్ ఫైర్ లో పేర్కొన్నారని, అది అబద్ధమా? అని ప్రశ్నించారు.
Details
హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీక
అలాగే మహత్మ గాంధీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో టిప్పు సుల్తాన్‌ను హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా వర్ణించారని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే, సప్కల్ తన వ్యాఖ్యల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 'స్వరాజ్య' సాధన కోసం ఎలా పోరాడారో, అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ కూడా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. టిప్పు పోరాటం శివాజీ మహారాజ్ ఆదర్శాలకు అనుగుణంగా ఉందని, ఆయన ఒక యోధుడు, భారత పుత్రుడని అభివర్ణించారు. శివాజీతో సమానంగా టిప్పును పరాక్రమానికి ప్రతీకగా చూడాలని అన్నారు. ఈ పరిణామాలతో మాలేగావ్ ఫోటో వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచుతోంది.