Chandrababu: భక్తుల విశ్వాసాలతో ఆటలాడరాదు.. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాబాయి హత్య వంటి ఘోర నేరాన్నే చిన్న విషయంగా చూసిన వారికి, తిరుమల పరకామణి చోరీ వంటి పవిత్రతకు సంబంధించిన అంశం పెద్ద సమస్యగా ఎలా కనిపిస్తుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల పరకామణిలో రూ.70 వేల చోరీకి, దానికి సంబంధించిన కేసును సెటిల్ చేయాలనే ప్రయత్నంలో రూ.14 కోట్ల ఆస్తి రాసిచ్చే పరిస్థితి ఏర్పడటం, అక్కడ జరిగిన దోపిడీ స్థాయిని స్పష్టం చేస్తోందని అన్నారు. జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
Details
దొంగతనాన్ని కూడా తప్పుకాదని చెప్పడం అనైతికం
దేవాలయ పవిత్రత, భక్తుల భావాలు, ఏడుకొండల వాడి విశ్వాసాలకు జగన్‌కు విలువ లేదని విమర్శించారు. బాబాయి హత్యను సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసినంత సులభంగా పవిత్రక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలనుకోవడం అమానుషమని అన్నారు. తప్పు చేసినవారిని సమర్థించడం, దొంగతనాన్ని కూడా తప్పుకాదని చెప్పడం అనైతికతకు పరాకాష్టగా అభివర్ణించారు. శ్రీవారి ఆలయం ప్రతి అంశంలో భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుందని, అలాంటి సున్నితమైన విషయాన్ని కూడా తేలికగా తీసుకుని "సెటిల్ చేశాం" అనే రీతిలో మాట్లాడడం ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించిందని చెప్పారు. హుండీకి భక్తులు సమర్పించిన దానాలను కొట్టేసిన దొంగలతో సెటిల్‌మెంట్ అంటే ఏమిటని ప్రశ్నించారు.
Details
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఘోర పాపం
యావత్ ప్రజలు, అన్ని వర్గాల వారు జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారని తెలిపారు. "దేవుడి హుండీ నుంచి జరిగిన చోరీని సెటిల్ చేయడానికి జగన్ ఎవరు?" అని ఆయన ప్రశ్నించారు. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఘోర పాపమని ఖండించారు. అంతేకాకుండా, గత ప్రభుత్వంలో నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో మాఫియా కార్యకలాపాలు విస్తరించాయని, 'చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేసినంత ఘనత' అక్కడి అక్రమాలకు దక్కిందని ఎక్కుపెట్టారు. నెల్లూరులో 'లేడీడాన్స్' వంటి అక్రమ వ్యవస్థలు ఎలా వెలసాయో చూసి తానూ ఆశ్చర్యపోయానని చెప్పారు.
Details
రాజీకి తావులేదు
లా అండ్ ఆర్డర్‌పై రాజీకి తావులేదని, ప్రభుత్వం చేపట్టిన నాటినుంచి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో సమస్యలు పరిష్కారమవుతూ అభివృద్ధి సాగుతుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ అభివృద్ధిని రాజకీయంగా కొందరు తట్టుకోలేక బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని నేటి పాలకులు కూడా గుర్తిస్తున్నారని, ఆ సమయంలో వేసిన అభివృద్ధి విత్తనాల ఫలితంగానే కోకాపేటలో భూములకు రికార్డు స్థాయిలో ధర పలుగుతోందని గుర్తుచేశారు.