LOADING...
Supreme Court: విగ్రహాల నిర్మాణానికి ప్రజాధనాన్ని ఉపయోగించవద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. 
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Supreme Court: విగ్రహాల నిర్మాణానికి ప్రజాధనాన్ని ఉపయోగించవద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్‌కే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది. ప్రజా నిధులను విగ్రహాల నిర్మాణానికి వినియోగించరాదని స్పష్టంగా ఆదేశించింది. "మీరు మీ మాజీ నేతలకు గౌరవం ఇవ్వాలనుకోవచ్చు, కానీ దానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు వాడుతున్నారు? ఇది అనుమతించబడదు" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశద్వారం వద్ద మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది.

వివరాలు 

విగ్రహ నిర్మాణ పనుల కోసం 30 లక్షల రూపాయలు 

ఇప్పటికే కొన్ని నెలల క్రితమే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 30 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే, ఈ చర్యకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ మద్రాస్ హైకోర్టులో దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని తీర్పునిచ్చింది. కొన్ని సందర్భాల్లో విగ్రహాల కారణంగా రాకపోకల్లో అంతరాయం కలుగుతోందని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని హైకోర్టు సూచించింది. అందువల్ల విగ్రహ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని ఆదేశించింది.

వివరాలు 

విగ్రహాల కోసం ప్రభుత్వ ఖజానా వాడకూడదు 

ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా విచారణలో, ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ మద్రాస్ హైకోర్టు తీర్పుకు మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించింది. "మాజీ నాయకుల గౌరవార్థం ప్రజా ధనాన్ని ఎలా వినియోగించగలరు?" అని జస్టిస్ విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. విగ్రహాల కోసం ప్రభుత్వ ఖజానా వాడకూడదని మరోసారి స్పష్టంచేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. అదనపు ఊరట కావాలనుకుంటే, అవసరమైతే మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని కూడా సలహా ఇచ్చారు.