
Consumer Right: ఇంధనం నాణ్యతపై సందేహమా?.. పెట్రోల్‌బంకులోనే పరీక్షించే హక్కు మీకుంది!
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫీస్‌కో, పనిమీద బయటకో వెళ్లే ముందు మనం ఎప్పుడూ బండిలో పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. కానీ ఆ పెట్రోల్ నిజంగా సరైన నాణ్యతలో ఉందా? సరైన మోతాదులో పోస్తున్నారా? అనేది కూడా చూడాలన్న ఆలోచన చేసుకుంటున్నామా? అసలే ఈ తనిఖీ చేసుకోవడం వినియోగదారుల హక్కు అని చట్టం చెబుతోంది. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, కొద్దిగా అయినా తేడా వస్తే అది మన జేబుకే భారమవుతుంది. అందుకే వినియోగదారుల రక్షణ చట్టం కింద పెట్రోల్ బంకుల్లో నాణ్యత, కొలత పరీక్షించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి బంకు నిర్వాహకుడు తప్పనిసరిగా ఫిల్టర్ పేపర్లు, హైడ్రోమీటర్, థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి. ఎవరైనా వినియోగదారు పరీక్ష చేయమంటే ఇవ్వాల్సిందే.
Details
1. సాంద్రత (డెన్సిటీ) పరీక్ష
500 ఎంఎల్ గాజు జార్‌లో ¾ వంతు పెట్రోల్ నింపాలి. అందులో థర్మామీటర్, హైడ్రోమీటర్‌ను ముంచి టెంపరేచర్, డెన్సిటీని రికార్డ్ చేయాలి. ఆ తర్వాత ASTM (American Society for Testing of Materials) కన్వర్షన్ ఛార్టుతో 15°C వద్ద డెన్సిటీని లెక్కించాలి. బంకు రిజిస్టర్‌లో ఉన్న డెన్సిటీతో సరిపోల్చి చూడాలి. 2. కొలత పరీక్ష క్యాలిబ్రేటెడ్ 5 లీటర్ల మెజరింగ్ క్యాన్ ను బంకు మేనేజర్ వద్ద అడగాలి. మూత రంధ్రం వరకు పెట్రోల్ నింపి, మీటరుపై చూపిన లీటర్లతో సరిపోల్చాలి. తేడా ఉంటే అది కొలతలో తప్పు అన్నమాట.
Details
3. రెండు చుక్కల టెస్ట్
ఫిల్టర్ పేపరుపై రెండు చుక్కల పెట్రోల్ వేయాలి. రెండు నిమిషాల్లో పూర్తిగా ఆవిరైపోయి ఎలాంటి మరక రాకపోతే పెట్రోల్ స్వచ్ఛమైనదే. మరకలు మిగిలితే కల్తీ పెట్రోల్ అని అర్థం. ఇంకా గమనించాల్సిన విషయాలు పెట్రోల్ గన్‌ను పూర్తిగా పోసిన తర్వాతే బయటకు తీయాలి. లేని పక్షంలో 50-100 ఎంఎల్ లోపలే మిగిలిపోతుంది. తర్వాతి వినియోగదారుడి లెక్కలో కలుస్తుంది. మనం ఇచ్చిన డబ్బుకు పెట్రోల్ పోయించే ముందు మీటరు 'జీరో' నుంచి మొదలవుతున్నదా లేదా చూసుకోవాలి. లేకపోతే ముందు వ్యక్తికి పోసిన డబ్బు, మన లెక్కల్లో కలుపుతూ మోసం చేసే అవకాశం ఉంటుంది.
Details
ప్రతి వినియోగదారుడికి ఉండే సౌకర్యాలు
ఆయిల్ కంపెనీ సేల్స్ మేనేజర్ నంబర్లు బంకులో స్పష్టంగా ప్రదర్శించాలి. ఫస్ట్‌ఎయిడ్ బాక్స్** అందుబాటులో ఉండాలి. పురుషులు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఉండాలి. రక్షిత తాగునీరు కల్పించాలి. టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. అత్యవసర కాల్ ఫెసిలిటీ ఉండాలి. ఫిర్యాదు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు టోల్‌ఫ్రీ నంబర్: 1800 425 4202 SMS నంబర్: 9490165611 తెలంగాణ వినియోగదారులు టోల్‌ఫ్రీ నంబర్: 1800 425 00333 ఫోన్ నంబర్లు: 040-23336112, 040-23336114, 040-23336115