LOADING...
Vikarabad-Krishna railway line: రూ.2,750 కోట్లతో వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌కు డీపీఆర్‌ సిద్ధం
రూ.2,750 కోట్లతో వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌కు డీపీఆర్‌ సిద్ధం

Vikarabad-Krishna railway line: రూ.2,750 కోట్లతో వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌కు డీపీఆర్‌ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ తెలంగాణలోని పలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టు తదుపరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరింది. మొత్తం 130.28 కిలోమీటర్ల నిడివితో, సుమారు రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదన రూపొందించారు. రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమం కానుంది.

Details

కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ

వికారాబాద్‌-కృష్ణా రైల్వే మార్గానికి సంబంధించిన ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేసి తుది రూపం ఇచ్చారు. ప్రారంభంగా 120 కిలోమీటర్లుగా ప్రతిపాదించిన ఈ మార్గం, మార్పుల అనంతరం 130.28 కిలోమీటర్లకు పెరిగింది. అయితే నిర్మాణ వ్యయం, భూసేకరణ ఖర్చులు కలిపిన మొత్తం వ్యయం అంచనా ఆదాయం మధ్య గణనీయమైన తేడా ఉందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు ఆర్థికపరంగా లాభసాటి కాదని కేంద్రం అభిప్రాయపడింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణ తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా ఈ రైల్వే మార్గం అత్యంత అవసరమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమని తెలియజేసింది. ఈ విషయాన్ని కేంద్రానికి అధికారికంగా తెలియజేసింది.

Details

వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం

ప్రతిపాదిత రైల్వే మార్గం వికారాబాద్‌ నుంచి కృష్ణా జంక్షన్‌ వరకు సాగనుంది. రైల్వే బోర్డు ఆమోదం లభించి ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే పరిగి, కొడంగల్, మక్తల్, నారాయణపేట వంటి ప్రాంతాలకు తొలిసారిగా ప్రత్యక్ష రైల్వే అనుసంధానం లభించనుంది. ఈ మార్గం ద్వారా ధాన్యం, పత్తి, మిర్చి వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది. అలాగే ఎరువుల సరఫరా మెరుగుపడటంతో పాటు సిమెంటు, గ్రానైట్‌ రవాణాకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చి, కొత్త పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement