Loading...
Amaravati: సర్‌ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!
సర్‌ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!

Amaravati: సర్‌ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌/సర్‌) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్‌ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 4.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఆ సంఖ్య 3.71 కోట్లకు తగ్గింది. మొత్తం 44.89 లక్షల మంది (10.78 శాతం) ఓటర్ల పేర్లను తొలగింపు జాబితాలో చేర్చారు. ఇందులో మృతులు, శాశ్వతంగా నివాసం మార్చుకున్నవారు, చిరునామాలో లేని లేదా ఆచూకీ లభ్యం కానివారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారు. అయితే అర్హులైన వారు ఆగస్టు 30లోగా డిక్లరేషన్‌తో పాటు ఫారం-6 సమర్పిస్తే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుతామని ఎన్నికల సంఘం తెలిపింది.

వివరాలు

అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల

ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించి, అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.

నోటీసు ఇవ్వకుండా, విచారణ నిర్వహించకుండా ఏ ఒక్క ఓటరు పేరును కూడా తొలగించబోమని, అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కాకుండా చూడటం తమ కట్టుబాటని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

వివరాలు

ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ తొలగింపులు?

మృతుల జాబితాలో అత్యధికంగా రంపచోడవరం నియోజకవర్గంలో 21,731 మంది ఉండగా, అరకులో 18,529 మంది, ఇచ్ఛాపురంలో 16,487 మంది, పాడేరులో 16,263 మంది, కోవూరులో 14,705 మంది నమోదయ్యారు.

చిరునామాలో లేని లేదా ఆచూకీ లభ్యం కాని ఓటర్లలో కడప నియోజకవర్గం 31,694 మందితో మొదటి స్థానంలో నిలిచింది.

అనంతరం కర్నూలు (21,210), తిరుపతి (20,527), చంద్రగిరి (19,309), పాణ్యం (15,325) ఉన్నాయి.

శాశ్వతంగా నివాసం మార్చుకున్న వారి సంఖ్య తిరుపతిలో అత్యధికంగా 57,256 ఉండగా, గుంటూరు పశ్చిమలో 36,082, కర్నూలులో 28,594, గాజువాకలో 26,345, కోవూరులో 25,804 మంది నమోదయ్యారు.

ADVERTISEMENT

వివరాలు

జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు

రాష్ట్రంలోని 28 జిల్లాల వారీగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కర్నూలు జిల్లా 18.12 లక్షల ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది.

అనంతపురంలో 17.90 లక్షలు, విశాఖపట్నంలో 17.83 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2.39 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.36 లక్షలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

మహిళా ఓటర్లలో టాప్ జిల్లాలు

మహిళా ఓటర్ల పరంగా కర్నూలు జిల్లా 9.19 లక్షలతో మొదటి స్థానంలో ఉంది. అనంతరం విశాఖపట్నం (9.11 లక్షలు), అనంతపురం (9.07 లక్షలు), శ్రీకాకుళం (8.70 లక్షలు), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (8.58 లక్షలు) ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించని ఓటర్లు

ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించని ఓటర్లు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2,90,683 మంది ఉన్నారు. వీరిలో 1.52 లక్షల మంది మహిళలే.

తిరుపతి జిల్లాలో 2,87,835 మంది, కర్నూలు జిల్లాలో 2,73,587 మంది ఓటర్లు ఇంకా ఫారాలు సమర్పించలేదు.

వివరాలు

ఓటర్ల జాబితాలో పేరు ఎలా చెక్‌ చేసుకోవాలి?

ఓటర్లు ఎన్నికల సంఘం రూపొందించిన ఈసీఐనెట్‌ (ECINet) యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తమ పేరు జాబితాలో ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

యాప్‌లో 'వోటర్‌ సర్వీసెస్' విభాగంలో 'Search Your Name in Voters List' ఆప్షన్‌ను ఎంచుకుంటే నాలుగు విధానాల ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఓటర్‌ ఐడీ (EPIC) నంబర్‌తో: ఓటరు కార్డు నంబర్‌ను నమోదు చేస్తే మీ ఓటు ఏ బూత్‌, ఏ పార్ట్‌, ఏ సీరియల్‌ నంబర్‌లో ఉందో వెంటనే తెలుస్తుంది. ఇది అత్యంత సులభమైన విధానం.

వివరాలు

ఓటీపీతో వివరాలు తెలుసుకోవచ్చు

వ్యక్తిగత వివరాలతో: పేరు, బంధువు పేరు, వయస్సు, లింగం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలను అక్షర దోషాలు లేకుండా నమోదు చేస్తే మాత్రమే ఫలితం వస్తుంది.

మొబైల్‌ నంబర్‌ ద్వారా: ఓటరు కార్డు మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయి ఉంటే, రాష్ట్రం ఎంపిక చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేసిన తర్వాత వచ్చే ఓటీపీతో వివరాలు తెలుసుకోవచ్చు.

క్యూఆర్‌/బార్‌కోడ్‌ స్కాన్‌ ద్వారా: ఓటరు కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ లేదా బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా వివరాలను పరిశీలించవచ్చు.

వివరాలు

వెబ్‌సైట్‌లో కూడా అవకాశం

ఓటర్లు బ్రౌజర్‌లో [https://voters.eci.gov.in/login](https://voters.eci.gov.in/login) వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి Citizen Services Portalలోకి వెళ్లాలి. అక్కడ 'Search Your Name in Voter List' ఆప్షన్‌ను ఎంచుకుని EPIC నంబర్‌, వ్యక్తిగత వివరాలు లేదా మొబైల్‌ నంబర్‌ ఆధారంగా తమ ఓటరు వివరాలను తెలుసుకోవచ్చు.

ఒకవేళ పేరు కనిపించకపోతే స్థానిక బీఎల్‌వోను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

ADVERTISEMENT