LOADING...
Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు
ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు

Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది. త్వరలోనే డ్రోన్లు,రోబోలు సేవల్లోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఎత్తైన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, రసాయన పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాల సమయంలో వీటి వినియోగం ఉండనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పలుమార్లు పరీక్షలు నిర్వహించి, వాటి వినియోగానికి అనువైన పరిస్థితులను గుర్తించారు. ఇకపై వాటిని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో తొలి దశలో 6 డ్రోన్లు, ఒక రోబో కొనుగోలు చేయనున్నారు. మే నెల నాటికి ఇవి అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. వాటి పనితీరు ఆధారంగా రెండో దశలో మరిన్ని యంత్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

డ్రోన్లతో అగ్ని ప్రమాదాలపై నిఘా

ముఖ్యంగా మంటల వ్యాప్తిని గుర్తించడం, త్వరగా అదుపులోకి తీసుకురావడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. డ్రోన్ల సహాయంతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా చిత్రీకరించవచ్చు. మంటలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఏ దిశగా వ్యాపిస్తున్నాయి? వంటి వివరాలను స్పష్టంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. డ్రోన్ల ద్వారా వచ్చే ప్రత్యక్ష దృశ్యాల ఆధారంగా అగ్నిమాపక సిబ్బంది తక్షణ ప్రణాళిక రూపొందించి సహాయక చర్యలు చేపడతారు. అలాగే ఎత్తైన భవనాలు, పొగతో నిండిన ప్రాంతాల్లో మనుషులు చిక్కుకుపోయిన సందర్భాల్లో డ్రోన్లలో అమర్చిన థర్మల్ సెన్సర్ల ద్వారా వారిని గుర్తించవచ్చు. అవసరమైతే డ్రోన్ల ద్వారా ఫైర్ సప్రెషన్ కెమికల్స్‌ను పిచికారీ చేసి మంటలను అదుపు చేయవచ్చు.

వివరాలు 

ప్రాణాపాయం ఉన్న చోట రోబోల వినియోగం

సిబ్బంది మంటల దగ్గరకు వెళ్లడం ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో రోబోలు కీలకంగా మారనున్నాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ రోబోలను మంటల సమీపానికి పంపించి, నీరు లేదా ఫోమ్‌ను నేరుగా పిచికారీ చేయించవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిని తట్టుకుని పనిచేసే సామర్థ్యం వీటికి ఉంది. ప్రత్యేకంగా కెమికల్ ఫ్యాక్టరీలు, గ్యాస్ లీకేజీలు, భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో రోబోలు సమర్థంగా పనిచేస్తాయి. వీటిలో అమర్చిన కెమెరాలు, థర్మల్ సెన్సర్ల సహాయంతో పొగతో నిండిన భవనాల్లోకి వెళ్లి లోపల చిక్కుకున్న వ్యక్తులను గుర్తించి ఆ దృశ్యాలను కంట్రోల్ రూమ్‌కు పంపిస్తాయి.

Advertisement

వివరాలు 

మే నుంచి సేవల్లోకి..

అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఇప్పటికే రోబోల వినియోగం విస్తృతంగా ఉందని తెలిపారు. అక్కడి అనుభవాలను పరిశీలించి ఏపీలో కూడా అదే విధంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రోబో కొనుగోలుకు ఏపీటీఎస్ ద్వారా టెండర్లు పిలిచామని, డ్రోన్ల వినియోగంపై పలుమార్లు ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆ పరీక్షలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. డ్రోన్ కార్పొరేషన్ ద్వారా వీటిని త్వరలో సమకూర్చుకుని, దశలవారీగా సంఖ్య పెంచుతామని తెలిపారు. మే నెల నుంచి ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని స్పష్టం చేశారు.

Advertisement