దేవి నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు..రోజూ 1.70 లక్షల మందికి దుర్గమ్మ దర్శనం
దసరా నవరాత్రి 2023, ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతోంది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతీరోజూ లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. సెకనుకు ఇద్దరు లేదా ముగ్గురు భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. రోజుకు 4 గంటలు పూజలు, నివేదనలు, 20 గంటలపాటు భక్తుల దర్శనాలు ఉంటాయన్నారు. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రొటోకాల్ ఉన్నవారు స్వయంగా వస్తేనే దర్శనానికి అనుమతిస్తామన్నారు.
అక్టోబర్ 15న తొలి రోజు స్నాపనభిషేకం అనంతరం ప్రత్యేక దర్శనాలు
అక్టోబర్ 15న ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 23న విజయదశమిన 10.30 గంటలకు పూర్ణాహుతితో వేడుకలు ముగియనున్నాయి. శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులను దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. తొలి రోజు స్నాపనభిషేకం తర్వాత ప్రత్యేక దర్శనాల్లో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు : బాలాత్రిపుర సుందరి దేవి రెండో రోజు గాయత్రీ దేవి మూడో రోజు అన్నపూర్ణ దేవి నాలుగో రోజు మహాలక్ష్మి దేవి ఐదో రోజు లలితా త్రిపుర సుందరి దేవి ఆరో రోజు సరస్వతి దేవి, ఎనిమిదో రోజు కనకదుర్గ దేవి, తొమ్మిది రోజు మహిషాశుర మర్దినిగా, పదో రోజు రాజరాజేశ్వరి దేవిగా 23న భక్తకోటికి దివ్వదర్శనం ఇవనున్నారు.
మిగతా రోజుల్లో తెల్లవారుజామునే, 4 గంటల నుంచి దర్శనాలు
దసరా నాడు బెజవాడ కనకదుర్గమ్మ దేదీప్యమానంగా వెలిగిపోనున్నారు. మొదటి రోజు 15న అమ్మవారి స్నాపనభిషేకం అనంతరం ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలు మొదలవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రాత్రి 10 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించామని స్పష్టం చేశారు. మిగతా రోజుల్లో తెల్లవారుజామునే, 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం 20న సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోచ్చని వివరించారు.