
Andhra News: ఆంధ్రప్రదేశ్'లో 'లీప్' పాఠశాలలు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ (లీప్) పాఠశాల ను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ప్రాథమికంగా లీప్ పథకాన్ని అమలు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జూన్ నుంచి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
లీప్: ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రకటించారు, దీనినే లీప్ గా పేర్కొంటున్నారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న సవాళ్లు, సమస్యలను గుర్తించి, రాబోయే ఐదేళ్లలో అవసరమైన మార్పులను తీసుకురావడానికి లీప్ డాక్యుమెంట్ ను రూపొందించారు.
ఇందులో పూర్వ ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అమలు చేయాల్సిన చర్యలు, వాటికి అవసరమైన సమయాలను ఖరారు చేశారు.
లీప్ పాఠశాలలను ఎమ్మెల్యేలు, జిల్లా విద్యాధికారులు, కలెక్టర్లు కలిసి ఎంపిక చేస్తారు. వీటికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, దాతల సహాయంతో అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు.
వివరాలు
లీప్ అమలులో ముఖ్యమైన లక్ష్యాలు
లీప్ అమలుతో సాధించాల్సిన లక్ష్యాలను నాలుగు స్థాయిలుగా విభజించారు.
ఫౌండేషనల్ స్థాయి
అంగన్‌వాడీ కేంద్రాల్లో 100% అభ్యసన కార్యక్రమాలు అమలు. పిల్లలను మొదటి తరగతిలో చేరేందుకు సిద్ధం చేయడం. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలను 5% పెంచే చర్యలు.
ప్రాథమిక & ప్రాథమికోన్నత స్థాయిలో
80% మంది విద్యార్థులు వారి స్థాయికి తగిన సామర్థ్యాలు సాధించడం. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ స్టార్ రేటింగ్ పొందేలా అభ్యసన ప్రమాణాలు పెంపొందించడం. డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు నైపుణ్యాలను కరిక్యులంలో ప్రవేశపెట్టడం. చదువు మధ్యలో మానేసిన 95% మంది విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్పించడం.
వివరాలు
సెకండరీ స్థాయిలో
డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు నైపుణ్యాలను కరిక్యులంలో ప్రవేశపెట్టడం. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.
లీప్ అమలు: ఐదు ప్రధాన కేంద్రీకృత అంశాలు
1. ప్రతి పౌరుడికి సమాన విద్యా అవకాశాలు
స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంపొందించడం. లింగ, సామాజిక సమ్మిళితత, దివ్యాంగుల అవసరాలను గుర్తించి తగిన సదుపాయాలు కల్పించడం.
2. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి
భవిష్యత్తుపై దృష్టిసారించి విధ్య, నైపుణ్యాలను పెంపొందించడం.
3. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు
భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పాఠ్య ప్రణాళిక రూపొందించడం.
4. పరిశోధన, ఇన్నోవేషన్ ప్రోత్సాహం
సృజనాత్మక పరిశోధనలు, వ్యవస్థాపక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. నాలెడ్జ్ ఎకనామీ, ఇన్నోవేషన్ క్లస్టర్ల అభివృద్ధి.
వివరాలు
రాష్ట్ర విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి..
5. ప్రపంచ స్థాయి ప్రతిభ అభివృద్ధి
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా కార్యక్రమాలను రూపొందించడం. ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం.
లీప్ పథకం ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యార్థులకు నూతన సాంకేతికతలు, పరిశ్రమ అవసరాలను కలిసేలా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ, అభ్యసన ప్రమాణాలను పెంపొందించడం ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వ విద్యాశాఖ కృషి చేస్తోంది.