Loading...
Earthquake: అరుణాచల్‌ప్రదేశ్‌ అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం 
అరుణాచల్‌ప్రదేశ్‌ అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Earthquake: అరుణాచల్‌ప్రదేశ్‌ అప్పర్ సియాంగ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్‌సీఎస్ వివరాల ప్రకారం.. ఉదయం 5.45 గంటలకు అప్పర్ సియాంగ్ జిల్లాలోని పాంగిన్‌కు సుమారు 116 కిలోమీటర్ల దూరంలో, భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రధాన భూకంపానికి ముందు అదే ప్రాంతంలో వరుసగా మూడు స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది.

వివరాలు 

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 

మొదటి ప్రకంపనం ఉదయం 3.40 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో నమోదైంది.

అనంతరం ఉదయం 3.55 గంటలకు 3.2 తీవ్రతతో మరో ప్రకంపనం సంభవించింది.

ఆ తర్వాత ఉదయం 4.34 గంటలకు మరోసారి 2.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇదే అరుణాచల్‌ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో బుధవారం కూడా భూకంపం సంభవించింది.

వివరాలు 

భూకంప ప్రభావిత జోన్‌లో ఈశాన్య ప్రాంతం

ఆ ప్రకంపన రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో నమోదైంది.

షి యోమి జిల్లాకు ఈశాన్య దిశగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు.

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం భూకంప ప్రభావిత జోన్‌లో ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ భూప్రకంపనలు నమోదవుతుంటాయి.

అందుకే ఆయా రాష్ట్రాల్లో భూకంపాలపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

ADVERTISEMENT