Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం కలకలం.. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత
తెలంగాణలో శనివారం మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి ప్రాంతంలో ఈసారి భూకంప కేంద్రంగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. భూమి కంపించడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మూడ్రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ములుగు జిల్లా మేడారం ప్రాంతం కేంద్రంగా నమోదైన ఆ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతను గణించుకుంది.
ఇటీవల తెలంగాణలో వరుస భూకంపాలు
ఈ భూకంపం దాదాపు 40 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో వరుస భూకంపాలు సంభవించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకంగా, ములుగు జిల్లా మేడారం, మారేడుపాక, బోర్లగూడెం ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రతతో ఉండాలని, భూకంప సమయంలో ఎలా స్పందించాలనే మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.