Maharashtra: మహారాష్ట్రలో భూకంపం కలకలం.. విదర్భ-మరాఠ్వాడలో వణికిన ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పర్భణి, నాందేడ్, హింగోలి, వాషిం, యవత్మాల్ జిల్లాల్లో స్వల్ప భూకంప ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో భూకంప ప్రభావంతో ఇళ్ల గోడల్లో పగుళ్లు ఏర్పడగా, పైకప్పులు కదిలినట్లు స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8:46 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ప్రత్యేకంగా హింగోలి జిల్లాలో ఉదయం 8:47 గంటలకు భూకంపం ఎక్కువగా అనిపించినట్లు వెల్లడైంది. ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు ప్రకంపనలు నమోదవుతున్నప్పటికీ, ఈసారి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు చెబుతున్నారు.
వివరాలు
బయటికిపరుగులు తీసిన జనాలు
భూకంపం సంభవించిన వెంటనే అనేక గ్రామాల్లో ఇళ్లలో ఉన్న పాత్రలు, వస్తువులు కింద పడిపోయాయి. చాలా ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా హింగోలి, నాందేడ్, పర్భణి జిల్లాల్లో ప్రకంపనలు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. హింగోలి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ ప్రకంపనలు అనుభవించబడినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రమాదం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వివరాలు
10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు
ఈ భూకంపానికి సంబంధించిన అధికారిక నమోదు ఇంకా పూర్తిగా జరగకపోయినా, అధికారులు సమీక్ష చేపడుతున్నారు. హింగోలి జిల్లాలోని వాస్మత్ సమీపంలోని పాంగ్రా షిండే గ్రామం ఈ భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైనట్లు సమాచారం. సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయి. మరోవైపు నాందేడ్ నగరంలోని సిడ్కో, వజీరాబాద్, ఆనంద్ నగర్, తరోడా సంగవి ప్రాంతాల్లో కూడా భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది. అలాగే యవత్మాల్ జిల్లా పుసాద్ తాలూకాలోని షెబల్పింప్రి ప్రాంతంలో ఉదయం 8:45 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ భూకంపం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించినప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా అధికారులు పేర్కొన్నారు.