Loading...
SIR: ఓటర్లకు మరో అవకాశం.. నమోదు, సవరణలు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు గడువు.. ఈసీ కీలక ప్రకటన
ఈసీ కీలక ప్రకటన

SIR: ఓటర్లకు మరో అవకాశం.. నమోదు, సవరణలు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు గడువు.. ఈసీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మరోసారి కీలక అవకాశం కల్పించింది. జూన్‌ 15 నుంచి జులై 24 మధ్య ఎన్యూమరేషన్‌ ఫారాలు బూత్‌స్థాయి అధికారులకు(బీఎల్‌వోలు) సమర్పించని వారు,తాజాగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, అలాగే పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత వివరాలు,చిరునామా లేదా ఇతర సమాచారంలో మార్పులు,సవరణలు చేయించుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా,ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని భావించే వారు కూడా వాటి తొలగింపునకు అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. ఓటర్లతో పాటు రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు)కూడా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఆగస్టు 30 వరకు గడువు నిర్ణయించింది.

వివరాలు 

మ్యాపింగ్‌లో లోపాలు.. నోటీసులు జారీ

దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in, ECINET మొబైల్‌ యాప్‌ ద్వారా లేదా నేరుగా బీఎల్‌వోలు, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వోలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వోలు) వద్ద సమర్పించవచ్చు.

అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో కూడా ఇదే వెబ్‌సైట్‌, యాప్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

నిర్దేశిత గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన వారిలో కొందరు 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ కోసం ఇచ్చిన వివరాల్లో లోపాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

మరికొందరు 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ చేయకుండానే ఫారాలు సమర్పించినట్లు తేలింది.

ఇలాంటి కేసులను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలిస్తూ సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తోంది.

వివరాలు 

సంబంధిత అధికారులకు సమర్పించాల్సిన పత్రాలు ఇవే.. 

అర్హత నిరూపించుకునేందుకు ఆధార్‌ కార్డును కాకుండా కింది పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించింది.

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారుకు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌.

1987 జులైకు ముందు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు.

అధికారిక జనన ధ్రువీకరణ పత్రం.

పాస్‌పోర్ట్‌

గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం.

అటవీ హక్కుల చట్టం కింద జారీ చేసిన ధ్రువీకరణ పత్రం.

కుల ధ్రువీకరణ పత్రం.

ADVERTISEMENT

వివరాలు 

అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా

నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (అమల్లో ఉన్న ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).

రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు రూపొందించిన ఫ్యామిలీ రిజిస్టర్‌.

ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం.

పై పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించిన తర్వాత అధికారులు వాటిని పరిశీలిస్తారు.

అర్హత నిర్ధారణ అనంతరం అక్టోబరు 3న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో వారి పేరును చేర్చుతారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏ అవసరానికి ఏ ఫారం?

ఫారం-6: కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఈ ఫారం, సంబంధిత డిక్లరేషన్‌ ఫారంతో కలిసి సమర్పించాలి.

ఫారం-7: ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటి తొలగింపునకు ఈ ఫారం ద్వారా దరఖాస్తు చేయాలి.

ఫారం-8: అదే నియోజకవర్గంలో ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారినప్పుడు లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినప్పుడు ఓటును కొత్త చిరునామాకు బదిలీ చేసుకోవడానికి ఈ ఫారం ఉపయోగించాలి. అలాగే పేరు, వయసు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాల్లో తప్పులు సరిచేయడం, ఫొటో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్‌)లోని పొరపాట్లను సవరించుకోవడానికి కూడా ఇదే ఫారం వినియోగించాలి.

ADVERTISEMENT