EC: ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సిద్ధం: ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ సంయుక్త కమిటీకి ప్రాథమికంగా తెలిపినట్లు కమిటీ ఛైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. లక్నోలో మూడు రోజులపాటు విద్యావేత్తలతో జరిగిన సంప్రదింపులు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమలుపై ఎన్నికల సంఘం ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో కమిటీ నేరుగా ఈసీని ప్రశ్నిస్తుందని, వారి అభిప్రాయాలను పూర్తిగా విన్న తర్వాతే ఈ ప్రతిపాదన అమలుకు అనుకూలమా కాదా అనే విషయంపై సిఫార్సులు చేస్తామని తెలిపారు.
వివరాలు
ఒకేసారి జాతీయ, రాష్ట్ర ప్రతినిధులను ఎన్నుకునే వీలు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రతిపాదన ప్రకారం లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యం ఉంది.
దీని లక్ష్యం దేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకే షెడ్యూల్‌లో నిర్వహించి, ఓటర్లు ఒకేసారి తమ జాతీయ, రాష్ట్ర ప్రతినిధులను ఎన్నుకునే వీలు కల్పించడం.
ఎన్నికల సంఘం సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని, అయితే అందుకు కనీసం ఆరు నెలల ముందుగా సమాచారం ఇవ్వాలని ఈసీ సూచించినట్లు చౌదరి తెలిపారు.
అలాగే 2028లో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదిస్తే, 2029 నుంచి 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమలు చేయవచ్చని ఎన్నికల సంఘం అభిప్రాయపడిందని చెప్పారు.
వివరాలు
భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
ఈ ప్రతిపాదన ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అని పేర్కొన్న చౌదరి, 1954 నుంచి 1960 మధ్య దేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.
భారత ఓటర్ల రాజకీయ అవగాహనను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని, వారు ఎవరికి ఓటు వేయాలో స్వయంగా నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని ఆయన అన్నారు.
అందుకే భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని వ్యాఖ్యానించారు.
కమిటీ ముందు హాజరైన రాజ్యాంగ నిపుణులు కూడా ఈ ప్రతిపాదన రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, సమాఖ్య వ్యవస్థకు లేదా ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదని అభిప్రాయపడ్డారని చౌదరి తెలిపారు.
వివరాలు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ మద్దతు
ఇది కేవలం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకే షెడ్యూల్‌లో నిర్వహించే విధానమే తప్ప రాష్ట్రాల అధికారాలు లేదా హక్కులను తగ్గించదని వారు స్పష్టం చేసినట్లు చెప్పారు.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని చౌదరి తెలిపారు.
పౌర సమాజ ప్రతినిధులు, సాధారణ ప్రజల్లో దాదాపు 99 శాతం మంది ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నారని, ఇదే ప్రజల అభిప్రాయమని ఆయన అన్నారు.
తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై అదనపు భారం పడుతోందని, అధికారులు తరచూ ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సి వస్తోందని పలువురు భాగస్వాములు కమిటీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
దీంతో ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారని చెప్పారు.
వివరాలు
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులోని వివిధ నిబంధనలపై ప్రజెంటేషన్లు
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్పూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో, అలహాబాద్ విశ్వవిద్యాలయం తదితర ప్రముఖ విద్యాసంస్థల ఉపకులపతులు, డైరెక్టర్లు, విభాగాధిపతులతో కమిటీ చర్చలు నిర్వహించింది.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులోని వివిధ నిబంధనలపై వారు సమగ్ర ప్రజెంటేషన్లు ఇచ్చారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మధ్యంతర ఎన్నికల ప్రభావం, మిగిలిన పదవీకాలం (Unexpired Term) భావన, దీర్ఘకాలంలో ఒకేసారి ఎన్నికల సాధ్యత, ఎన్నికల సంఘానికి ప్రతిపాదించిన అధికారాలు, ఇతర ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
వివరాలు
ఎన్నికల సంస్కరణలపై కమిటీ సమావేశం
చివరి విడతలో పద్మ పురస్కార గ్రహీతలు, పౌరసమాజ సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రముఖులతో కూడా కమిటీ సమావేశమైంది.
ఎన్నికల సంస్కరణలపై వారి సూచనలు స్వీకరించడంతో పాటు, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణల ఉద్దేశం, ముఖ్యాంశాలను సభ్యులు వివరించారు.
ఈ సంప్రదింపుల ద్వారా ఎన్నికల సంస్కరణలపై ప్రజల్లో విస్తృత చర్చకు అవకాశం కల్పించడం, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవడమే లక్ష్యమని కమిటీ పేర్కొంది.
అందిన సూచనలు, సిఫార్సులు ఒకేసారి ఎన్నికలపై రూపొందిస్తున్న చట్టాన్ని పరిశీలించడంలో ఉపయోగపడతాయని వెల్లడించింది.
వివరాలు
ఏడాది పొడవునా ఏదో ఒకచోట ఎన్నికలు
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజల పన్నుల రూపంలో భారీ వ్యయం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అధికారులు తమ సాధారణ విధులను పక్కనబెట్టి ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోందని తెలిపింది.
దీని ప్రభావంతో పేదల సంక్షేమ పథకాల అమలు ఆలస్యమవుతోందని, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చౌదరి అన్నారు.
తరచూ ఎన్నికలు జరగడం వల్ల అనిశ్చితి వాతావరణం ఏర్పడి విదేశీ పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టడంలో వెనుకంజ వేయొచ్చని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, పిల్లల విద్యపై కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.