Pinarayi Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సంబంధించిన నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 12 ప్రధాన ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు కొనసాగుతుండటంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముందస్తు సమాచారంతో ఉదయం నుంచే అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఎక్కడెక్కడ? ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పినరయి విజయన్‌కు సంబంధించిన తిరువనంతపురంలోని అద్దె నివాసం, కన్నూరులోని స్వగృహంలో ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే సీఎంఆర్ఎల్ సంస్థ నిర్వహణాధికారి శశిధరన్ ఇంటితో పాటు మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ నివాసంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు.
వివరాలు
అక్రమ చెల్లింపుల వివాదం
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థ నుంచి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు అక్రమంగా నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆమె నిర్వహిస్తున్న ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా రూ.1.72 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలపైనే ప్రస్తుతం ఈడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో యాక్షన్ ఈ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ సంస్థ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం ఇవ్వాలన్న కంపెనీ అభ్యర్థనను కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో వెంటనే ఈడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు ప్రారంభించారు.