ED raids: దిల్లీలో ఈడీ సోదాలు.. రూ.5.12 కోట్ల నగదు,రూ.8.80 కోట్ల బంగారు వజ్రాభరణాలు స్వాధీనం!
ఈ వార్తాకథనం ఏంటి
మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీలోని ఒక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు-వజ్రాభరణాలు బయటపడ్డాయి. ఓ సూట్‌కేసులోనే సుమారు రూ.8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో చేసిన ఆభరణాలు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవే కాకుండా కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. హర్యానాకు చెందిన ఇందర్‌జిత్ సింగ్ యాదవ్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యూఏఈ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న అతడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
పెద్ద మొత్తంలో నగదు, విలువైన బంగారు ఆభరణాలు
ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న దిల్లీ సర్వప్రియా విహార్‌లో ఉన్న ఇందర్‌జిత్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు ప్రారంభించింది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో నగదు, విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. సోదాల కొనసాగింపులో బుధవారం ఉదయం బ్యాంకు అధికారులను పిలిపించి యంత్రాల సహాయంతో నగదు లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.5.12 కోట్ల నగదు లెక్కించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఒక సూట్‌కేసులో ఉన్న బంగారు, వజ్రాభరణాల విలువను దాదాపు రూ.8.80 కోట్లుగా అంచనా వేశారు. మరో బ్యాగులో చెక్ బుక్‌లు, సుమారు రూ.35 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
దోపిడీలు, ప్రైవేటు ఫైనాన్సర్లకు సంబంధించిన సెటిల్‌మెంట్‌లు, బెదిరింపు చర్యలతో సంబంధం ఉన్న కేసుల్లో ఇందర్‌జిత్ యాదవ్‌పై హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బెదిరింపులు, అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బుతో ఇందర్‌జిత్ విలాసవంతమైన భవనాలు, ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు.