LOADING...
Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు
పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు

Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఆమె ప్రమేయంపై ఆరోపణలు రావడంతో కంపెనీల చట్ట ఉల్లంఘన కింద నమోదైన కేసులో విచారణ కోసం శుక్రవారం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది. వీణతో పాటు సీఎంఆర్ఎల్‌కు సంబంధించిన మరో తొమ్మిది మందికి కూడా సమన్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో కీలక పత్రాలను ఈడీకి అందించేందుకు నిరాకరిస్తూ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను కార్పొరేట్ నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల కొట్టివేయడంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.

వివరాలు 

పలు డాక్యుమెంటరీ, డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరించిన ఈడీ

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు డాక్యుమెంటరీ, డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా విచారణ చేపట్టింది. సాఫ్ట్‌వేర్, స్కూల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సేవలను అందించే ఈ సంస్థకు సీఎంఆర్ఎల్ రూ.2.78 కోట్ల మేర చెల్లింపులు జరపగా, అందుకు తగిన సేవలు అందించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఏమిటి ఈ కేసు?

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ సంస్థ గతంలో వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు సుమారు రూ.2.73 కోట్లు చెల్లించింది. అయితే, ఆ చెల్లింపులకు బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదని ఆరోపణలు వచ్చాయి. 2023 ఆగస్టులో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ అది వాస్తవ సేవల కోసం కాకుండా మోసపూరితంగా జరిగిందని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) తన నివేదికలో పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఏమిటి ఈ కేసు?

2017 నుంచి 2020 మధ్యకాలంలో సీఎంఆర్ఎల్ నుంచి ఎక్సాలాజిక్‌కు సుమారు రూ.1.72 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేసులో భాగంగానే వీణకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement