ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్ కంపెనీ రచ్చ
ఓ కంపెనీ తన ఉద్యోగుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించింది. పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది. హరియాణాలోని గురుగ్రామ్ పరిధిలోని కోడింగ్ నింజాస్ అనే ఎడ్‌టెక్ సంస్థ నిర్వాకం విమర్శలకు తావిచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులెవరూ బయటకెళ్లకుండా యాజమాన్యం, ఆఫీసు గేటుకు తాళాలు వేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ కు గురవుతోంది. ఈ వీడియోలో వాచ్‌మెన్ ఆఫీస్ గేటుకు తాళాలు వేస్తూ కనిపించారు. అదేంటని ఉద్యోగి అడిగితే అనుమతి లేకుండా ఎవర్ని బయటకు పంపించకూడదని మేనేజర్ చెప్పారన్నారు. ఒకవేళ వెలుపలికి వెళ్లాలంటే అనుమతి తెచ్చుకోండని వాచ్‌మెన్ అంటున్న మాటలు వీడియోలో ఉండటంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి ఇలా జరగకుండా చూస్తాం : ఎడ్‌టెక్
కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం రోజురోజుకూ దిగజారుతోందని, ఇంతకంటే దారుణం ఉంటుందా అంటూ మండిపడుతున్నారు. విషయం కాస్త కంపెనీ చెవిన పడటంతో కోడింగ్ నింజాస్ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి చేసిన విపరీత చర్య వల్లే తాము అలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నామని, అయితే కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దామని కంపెనీ సమర్థించుకుంది. సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా తెలియజేశారని వెల్లడించింది. ఈ అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు సైతం విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారని సంస్థ వివరించింది. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామంది. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.