Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు.. తమిళనాడులో 18 మంది మృతి
తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుపాను తీవ్రంగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఈ తుపాన్ సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. తుఫాను బలహీనపడ్డప్పటికీ, అల్పపీడన ప్రభావంతో నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఫెంగల్ తుఫాన్ రాష్ట్రంలో ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ తుపాను కారణంగా 18 మంది మృత్యువాత పడ్డారు.
కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
తిరువన్నమలై కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ఇద్దరు పెద్దలున్నారు. విల్లుపురంలో వర్షాల ధాటికి మరో 8 మంది మృతి చెందారు. తిరువన్నమలైలో కొండచరియల ధ్వంసం కారణంగా పలు ఇళ్లు కూలిపోయాయి. రెస్క్యూ టీములు ప్రస్తుతం ధ్వంసమైన ఇళ్లలో మరింత సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. తుపాన్ కారణంగా కోయంబత్తూర్, నీలగిరి, దిండిగల్ వంటి ప్రాంతాల్లో ఇంకా వర్షపాతం కొనసాగుతుండగా, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.