El Niño Impact: ఎల్‌నినో ఎఫెక్ట్: రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు నిర్లక్ష్యంగా వృథా చేస్తున్న ప్రతి నీటి బొట్టు.. రాబోయే రోజుల్లో అమూల్యమైన వనరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో గత 45 రోజులుగా వర్షపాతం గణనీయంగా తగ్గింది. సాధారణంతో పోలిస్తే 52.1 శాతం లోటు వర్షపాతం నమోదవడంతో భవిష్యత్తులో నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడం వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో భూగర్భ జలమట్టాలు కూడా పడిపోవడంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింత దిగజారకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
ఇప్పటికే తాగునీటిలో భారీ లోటు
రాష్ట్రంలోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీల్లో ప్రతిరోజూ సరఫరా చేయాల్సిన తాగునీటిలో ఇప్పటికే 574మిలియన్ లీటర్ల లోటు ఉంది.
మొత్తం 2,680మిలియన్ లీటర్ల అవసరానికి ప్రస్తుతం 2,106మిలియన్ లీటర్ల నీటినే సరఫరా చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఒక ప్రాంతంలో నాలుగు రోజులకోసారి, మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు అందుతోంది.
ప్రస్తుతం 50కి పైగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో తగినన్ని నిల్వలు ఉన్నప్పటికీ,వర్షాభావం ఇలాగే కొనసాగితే రానున్న నెలల్లో సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యేకించి విశాఖపట్నం,ఒంగోలు,కాకినాడ,కర్నూలు,మచిలీపట్నం,అనంతపురం,కడపతో పాటు మరో 40కి పైగా పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఆందోళనకు కారణాలివే
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోతాయి.
దీంతో అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేయడం కష్టమవుతుంది.
రాష్ట్రంలోని 70 పురపాలక, నగరపాలక సంస్థలు ప్రధానంగా జలాశయాలు, చెరువులపైనే ఆధారపడి తాగునీటిని సరఫరా చేస్తున్నాయి.
ఇక భూగర్భ జలమట్టాలు తగ్గిపోతే బోర్ల ద్వారా నీటి సరఫరా కూడా దెబ్బతింటుంది.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో కలిపి మొత్తం 40,353 బోర్లు భూగర్భ జలాల ఆధారంగానే పనిచేస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
వివరాలు
దీర్ఘకాలిక చర్యలు ఇలా
వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయాలి.
చెరువులు, కుంటలను పునరుద్ధరించి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని తప్పనిసరి చేయాలి.
భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి.
వివరాలు
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు
ఇంట్లో నీటి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి.
స్నానం కోసం షవర్‌కు బదులుగా బకెట్‌ను ఉపయోగించాలి.
వాహనాలను పైపుతో కాకుండా బకెట్‌తో శుభ్రం చేయాలి.
ఆర్వో ప్యూరిఫయర్ నుంచి వచ్చే వ్యర్థ నీటిని మొక్కలకు నీరు పోయడానికి, శుభ్రపరిచే పనులకు వినియోగించాలి.
వాషింగ్ మిషన్‌ను పూర్తిస్థాయి లోడ్ ఉన్నప్పుడే ఉపయోగించడం ద్వారా నీటిని ఆదా చేయాలి.
ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
జలాశయాల్లో నీటి వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి.
నీటి లీకేజీల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి.
అవసరమైతే నీటి సరఫరాకు షెడ్యూల్ విధానం అమలు చేయాలి.
కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి.
అనధికారిక నీటి వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
వివరాలు
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి
4 రోజులకోసారి సరఫరా చేస్తున్న సంస్థలు: 1
3 రోజులకోసారి సరఫరా చేస్తున్న సంస్థలు: 6
రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్న సంస్థలు: 37
ప్రతిరోజూ నీరు అందిస్తున్న సంస్థలు: 53
రోజుకు రెండుసార్లు సరఫరా చేస్తున్న సంస్థలు: 26