Andhra Pradesh: ఖరీఫ్‌కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో వర్షపాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంతో పోలిస్తే సుమారు 12 శాతం వరకు వర్షాలు తగ్గే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో సాగు రంగంపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. మే 15 నాటికే కాలువల ద్వారా నీటిని అందుబాటులోకి తెచ్చి, రైతులు ముందుగానే నార్లు వేయాలని సూచించింది. మెట్టపంటలు పండించే రైతులు సహజ సేద్యాన్ని అవలంబించాలని సూచనలు జారీ చేసింది. ఉద్యాన పంటలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల యంత్రాంగానికి మార్గదర్శకాలు ఇచ్చింది.
వివరాలు
కీలక సమయంలో వరుణుడి పరీక్ష
ఖరీఫ్ కాలం మొత్తం, అంటే జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో నాలుగు నెలలపాటు తక్కువ వర్షాలు కురిసే అవకాశముంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడు నెలలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు నెలలపాటు వర్షాలు తగ్గొచ్చు. మిగిలిన జిల్లాల్లో కూడా కనీసం ఒక నెలలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది.
వివరాలు
నెలవారీగా వర్షపాతం తగ్గుదల అంచనా
సాధారణ స్థాయితో పోలిస్తే జూన్‌లో 8.4%, జులైలో 25.4%, ఆగస్టులో 14.5%, సెప్టెంబరులో 0.4% వరకు వర్షపాతం తగ్గే అవకాశముందని అంచనా. జూన్ నెలలో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు అనుకూలించకపోవచ్చు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు,పల్నాడు,కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. జులైలో శ్రీకాకుళం నుంచి ఉమ్మడి గుంటూరు వరకు తక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు,వైఎస్సార్ కడప,మార్కాపురం ప్రాంతాల్లో కూడా కొన్నిచోట్ల వర్షాలు తగ్గొచ్చు. ఆగస్టులో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాభావం ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. సెప్టెంబరులో అల్లూరి, ఏలూరు, పల్నాడు,ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షపాతం తగ్గే అవకాశముంది.
వివరాలు
జిల్లాల యంత్రాంగానికి కీలక బాధ్యతలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సహజ సేద్యాన్ని అన్ని మండలాల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించింది. కరవు ప్రభావిత మండలాల్లో రుతుపవనాలు ప్రారంభం కాకముందే 'ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్' (PMDS) విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించింది. వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బత్తాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. తోటలకు నీటి లభ్యతను అంచనా వేసి, కాలువలు, చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
జిల్లాల యంత్రాంగానికి కీలక బాధ్యతలు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నీటి వనరులు ఉన్నచోట మాత్రమే టమాటా సాగును ప్రోత్సహించాలన్నారు. మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో వర్షాధారిత మిరప సాగును తగ్గించాలని సూచించారు. ముఖ్యమైన పంటలకు ప్రాధాన్యతనిస్తూ నీటి వినియోగం చేయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాధార భూముల్లో ఉల్లి సాగు చేయవద్దని రైతులకు సూచించారు. కరవును తట్టుకునే పంటలపై అవగాహన పెంచాలని ఆదేశించారు. చిత్తూరు, విజయనగరం, ఏలూరు, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లో మామిడి తోటలకు కవర్లు కట్టే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.