General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19నుంచి ఏడు దశల్లో జరుగుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19న ఫేజ్ 1 పోలింగ్ ఏప్రిల్ 26న 2వ దశ పోలింగ్ మే 7న 3వ దశ పోలింగ్ మే 13న 4వ దశ పోలింగ్ మే 20న 5వ దశ పోలింగ్ మే 25న 6వ దశ పోలింగ్ జూన్ 1న 7వ దశ పోలింగ్
ఈ దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు
భారతదేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ అని అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలన్నారు. దేశంలో 29 ఏళ్లలోపు యువ ఓటర్లు 21.5 కోట్ల మంది ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. 1.82 కోట్ల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారన్నారు. ఈ దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు కాగా.. అందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని స్పష్టం చేశారు. 100 ఏళ్లు పైబడిన 2 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. కొత్త ఓటర్లలో 85 లక్షల మంది యువతులే ఉన్నారని, 85 ఏళ్లు పైబడిన 82 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపింది.
55 లక్షలకుపైగా ఈవీఎంల వినియోగం
17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం 55 లక్షలకు పైగా ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వివరించారు. భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఇప్పటి వరకు 17 సార్వత్రిక ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.