LOADING...
Local Body Election Schedule : స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన

Local Body Election Schedule : స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో స్థానిక సంస్థల (వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్షులు) ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు రాకుండా చూడటం ముఖ్యమైన అంశంగా ఉండడంతో ఆదివారం విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తదుపరి ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈ పరిస్ధితిలో సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది.

Details

అధికారులతో విస్తృత స్థాయి సమావేశం

ఇందులో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. శనివారం రాత్రి జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌శాఖ ఖరారు చేసి సంబంధిత గెజిట్‌ను జారీ చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, అన్ని జిల్లాల్లోని వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ గెజిట్‌లను పంచాయతీరాజ్‌ డైరెక్టరేట్‌కు పంపారు. అక్కడి ఉన్నతాధికారులు అన్ని గెజిట్‌లను క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని తన కార్యాలయంలో అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

Details

రిజర్వేషన్లపై కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు

రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వని కారణంగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ జారీకి ఎటువంటి ఇబ్బంది రాదని అధికారులు తెలిపారు. న్యాయనిపుణులతో కూడా చర్చించుకుని, వివిధ రాష్ట్రాల్లోని తీర్పుల ఆధారంగా సూచనలు తీసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి, అన్నివిధాలా పరిస్థితులు అనుకూలంగా ఉంటే సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసిన రిజర్వేషన్లపై కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు అందాయి.

Details

పున:పరిశీలన తర్వాత సరైన నిర్ణయం తీసుకొనే అవకాశం

వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు సరిగా కేటాయించలేదని, జనాభా ప్రాతిపాదికకు అనుగుణంగా కేటాయింపులు లేవని, ఇతర పరిగణనీయ అంశాలపై పలు ప్రాంతీయ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లను ఆదివారం పునఃపరిశీలన జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి పొద్దుపొయేవరకు పునఃపరిశీలన జరిపి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు.