నేడే తెలంగాణ తీర్పు.. 'కేసీఆర్' హ్యాట్రిక్ కొడతారా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు, ఈ సారి అధికారం తమదే అన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిపోల్స్ అంచనా వేశాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణ ఓటరు ఎవరికి అధికారం కట్టబెట్టారనే విషయం తేలనుంది. తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం 60స్థానాలు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యహ్నం సమయానికి కౌంటింగ్ ఒక కొలిక్కి వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టత రానుంది.
సంక్షేమ పథకాలు వర్సెస్ ప్రభుత్వ వ్యతిరేకత
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే తీవ్రమైన పోటీ ఉంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపుకు సంబంధించి ఎవరి ధీమాలో వారు ఉన్నాయి. కేసీఆర్ ఇమేజ్‌తో పాటు సంక్షేమ పథకాలు తమకు మరోసారి ప్రజలు అధికారం కట్టబెడుతాయని అధికార బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. తద్వారా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టి.. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన ఏకైక సీఎంగా నిలవాలని ఆశపడుతున్నారు. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఫ్యాక్టర్‌తో పాటు, కుటుంబ పాలన, మార్పును రావాలి అనే నినాదాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన 6గ్యారంటీలు కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తాయని హస్తం పార్టీ విశ్వాసంతో ఉంది.
హంగ్ వస్తే పరిస్థితి ఏంటి?
తెలంగాణలో కాంగ్రెస్ భారీగా పుంజుకుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. మరకొన్ని మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో హంగ్ వస్తే పరిస్థితి ఏంటనే దానిపై అనేక రకాల ఊహాగానానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ.. హంగ్ వస్తే.. ఎంఐఎం పార్టీ కీలకంగా మారబోతోంది. అయితే ఎంఐఎం కాంగ్రెస్‌తో నడిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. హంగ్ వస్తే, ఎంఐఎం కచ్చితంగా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ, ఎంఐఎం మద్దతు ఇచ్చినా, మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే.. మాత్రం జాతీయ పార్టీలతో జతకట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏ జాతీయ పార్టీతో కేసీఆర్ జత కడుతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.