
Graduates MLC: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
అందులో భాగంగా పట్టభద్రుల నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి శాసనమండలి స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రక్రియను ప్రారంభించింది.
ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.
పల్లా
కొత్త ఓటర్లు దరఖాస్తుకు ఫిబ్రవరి 6 ఆఖరు
వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను రెడీ చేసేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మేరకు కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ అవకాశం కల్పలించింది.
ఫిబ్రవరి 6 వరకు కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 24న తుది ఓటర్ల ముసాయిదాను విడుదల చేస్తారు.
దీని తర్వాత మార్చి 14 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్చి 29లోగా వాటిని పరిష్కరించడం జరుగుతుంది.
నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4న వెలువడుతుంది. దరఖాస్తు ఫారం-18లో ఆధార్ నంబర్‌ను సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది.