LOADING...
Bob Blackman: 'మొత్తం జమ్ముకశ్మీర్ ను భారత్‌లో విలీనం చేయాలి': లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ
లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ

Bob Blackman: 'మొత్తం జమ్ముకశ్మీర్ ను భారత్‌లో విలీనం చేయాలి': లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్ముకశ్మీర్ అంశంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో నిర్వహించిన హైటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ-కశ్మీర్ ప్రాంతాలు(పీవోకే)తప్పకుండా భారత్‌లో విలీనం కావాల్సిందేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమణను గతంలోనూ తాను తీవ్రంగా వ్యతిరేకించానని,భవిష్యత్తులోనూ అదే వైఖరిని కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని బ్లాక్‌మన్ పూర్తిగా సమర్థించారు. ఈ చర్యను ఇప్పుడే కాకుండా 1992లోనే అమలు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కశ్మీరీ పండితులు తమ స్వస్థలాలను వదిలి వెళ్లాల్సిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు.

వివరాలు 

పీవోకేలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపాటు 

ప్రస్తుతం పీవోకేలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తోందని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని హెచ్చరించారు. గత ఏడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బాబ్ బ్లాక్‌మన్, ఆ ఘటన అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు తన మద్దతు ప్రకటించారు. కొన్నేళ్లుగా జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ప్రాంతంలో శాంతి నెలకొన్నట్లు భావించినప్పటికీ, పహల్గాం దాడితో ఉగ్రవాద సమస్య మళ్లీ బహిర్గతమైందని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తే ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారి తీస్తుందని పాకిస్థాన్‌ను ఆయన హెచ్చరించారు. కశ్మీర్ అంశంలో బ్లాక్‌మన్ గతంలోనూ పలుమార్లు భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement