LOADING...
Modikuntavagu Project: మోడికుంట'కు మోక్షం..ప్రాజెక్ట్ బాగు కోసం ఏకంగా రూ.720 కోట్లు 
మోడికుంట'కు మోక్షం..ప్రాజెక్ట్ బాగు కోసం ఏకంగా రూ.720 కోట్లు

Modikuntavagu Project: మోడికుంట'కు మోక్షం..ప్రాజెక్ట్ బాగు కోసం ఏకంగా రూ.720 కోట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోడికుంట వాగుపై నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒక మధ్యస్థాయి జల ప్రణాళిక. దాదాపు 20 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం మొదలైనప్పటి అంచనా వ్యయం రూ.124.6 కోట్లు కాగా, ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో తాజా మంత్రివర్గ ఆమోదంతో ఈ వ్యయం ఏకంగా రూ.720 కోట్లకు చేరింది. ఈ మేరకు వ్యయం సుమారు 600శాతం పెరిగినట్లైంది. ప్రాజెక్టు పూర్తి అయితే, 13,590ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించగలదు. అయితే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన 1,550 ఎకరాల అటవీ,పట్టా భూమిని అభివృద్ధి చేయాల్సి ఉంది. నిర్మాణ వ్యయాలు మరింత పెరగకపోతేనే ఈ మొత్తం సరిపోతుందేమోనన్న సందేహం నెలకొంది. ప్రాజెక్టులలో తాపీగా నడిచే పనుల కారణంగా ఎంతలా ఖర్చు పెరుగుతుందో చూపించే స్పష్టమైన ఉదాహరణగా ఇది నిలుస్తోంది.

వివరాలు 

2005 నాటి ప్రాజెక్టు.. 

ములుగు జిల్లా వాజేడు మండలంలోని కృష్ణాపురం వద్ద మోడికుంట వాగుపై రిజర్వాయర్ నిర్మించి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో 2005 మే 26న అప్పటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా రూ.124.6 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ప్రణాళిక ప్రకారం 1,259 మీటర్ల పొడవైన మట్టికట్ట,92 మీటర్ల స్పిల్‌వే, 21.85 కిలోమీటర్ల ప్రధాన కాలువ, పది డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పనులకు టెండర్‌ పిలవగా, 'గామన్ ఇండియా' సంస్థ రూ.118.95 కోట్ల బిడ్డింగ్‌ గెలుచుకొని 2005 జూలైలో ఒప్పందం చేసుకుంది. రెండు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా, దాదాపు 1,250 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది.

వివరాలు 

2005 నాటి ప్రాజెక్టు.. 

ఫలితంగా అనుమతుల ఆలస్యం, గుత్తేదారు నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎదురయ్యాయి. నీటిపారుదల శాఖ ప్రకారం, కాలువల కోసం భూసేకరణ జరిగినప్పటికీ గుత్తేదారు సంస్థ పనులు చేపట్టలేదు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో, 2022 ఆగస్టులో ఈ సంస్థను తొలగించి కొత్త గుత్తేదారునికి బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంచనాలను సవరించింది. కొత్త అంచనా వ్యయం రూ.527.66 కోట్లుగా నిర్ధారించి, 2022 ఆగస్టు 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

వివరాలు 

హైకోర్టులోకి కేసు.. నిర్ణయం ఆలస్యం 

ఈ నిర్ణయాన్ని అనుసరించి సంబంధిత ఎస్‌ఈ, 2023 అక్టోబర్ 29న 'గామన్ ఇండియా' సంస్థకు నోటీసు ఇచ్చాడు. తదనంతరం మళ్లీ టెండర్‌ ప్రక్రియ మొదలుపెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ, సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతులు ఇచ్చిన సంవత్సరం గడిచిన తర్వాతే గుత్తేదారుకు నోటీసు ఇవ్వడం గమనార్హం. హైకోర్టు ఆదేశాల మేరకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలను వినిపించేందుకు నీటిపారుదలశాఖ అవకాశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2024 జనవరి 31న ములుగులోని ఎస్‌ఈ ఎదుట గుత్తేదారు ప్రతినిధులు హాజరై సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించారు. వాటిని ప్రభుత్వ న్యాయవాదులు పరిశీలించి, గుత్తేదారును తొలగించిన తొలి ఉత్తర్వుల ప్రకారమే ముందుకు సాగాలని సూచించారు. దీనిపై నీటిపారుదలశాఖ తుది నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

తాజా అంచనాలు - మంత్రివర్గ ఆమోదం 

2024-25 నూతన ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా తాజా అంచనాలు రూపొందించారు. అటవీ భూమి, భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల మొత్తం ఖర్చు రూ.720.84 కోట్లుగా నిర్దేశించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ 2024 నవంబరులో పరిశీలించింది. ఆ పరిశీలనలో రూ.718.6 కోట్ల ఖర్చును ఆమోదించింది. ఈ మేరకు మే 17న నీటిపారుదల శాఖ అధికారిక ఆదేశాలు జారీ చేయగా, జూలై 29న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంచనాలు ర్యాటిఫై చేయబడ్డాయి.