E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రభుత్వ విధాన నిర్ణయంగా అమలు చేస్తున్నామని చెబుతూనే, మరోవైపు ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉందని, దీని పూర్తి ఫలితాలు వచ్చే ఏడాదికి స్పష్టమవుతాయని కేంద్రం కోర్టుకు వివరించింది. దీంతో వినియోగదారుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయా? మైలేజీ తగ్గుతుందా? అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, E20 పెట్రోల్ కారణంగా ఇంజిన్ సామర్థ్యం దెబ్బతింటుందని నిరూపించే బలమైన ఆధారాలు ప్రస్తుతం లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం
అంతేకాదు, ఈ విధానం దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించి, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొంది. 2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించిన ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. జూన్ 23న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో,టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే ఒక డిస్టిలరీ కోరిన అదనపు ఇథనాల్ కేటాయింపు అభ్యర్థనను పరిశీలించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) ఆదేశించింది.
వివరాలు
2025 అక్టోబర్‌లో ఖరారైన ఇథనాల్ సరఫరా ఒప్పందాలు
అయితే ఈ ఉత్తర్వు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీపీసీఎల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇథనాల్ సరఫరా ఒప్పందాలు ఇప్పటికే 2025 అక్టోబర్‌లో ఖరారయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదే తరహా పిటిషన్లు దేశంలోని పలు హైకోర్టుల్లో కూడా పెండింగ్‌లో ఉన్నాయని, వీటి ప్రభావం జాతీయ విధానంపై పడే అవకాశం ఉందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోందని, దీని వాస్తవ ఫలితాలు వచ్చే ఏడాది నాటికి స్పష్టమవుతాయని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
1,759 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా ఆఫర్లు: అటార్నీ జనరల్
ఒక సరఫరాదారుకు మాత్రమే కేటాయింపులో మార్పులు చేస్తే,ఇతర సంస్థలు కూడా అదే తరహా డిమాండ్లతో కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అనేక వ్యాజ్యాలు నమోదై, మొత్తం ఇథనాల్ సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వాదించారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న బీపీసీఎల్‌కు టెండర్ ప్రక్రియ అనంతరం సుమారు 1,759 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా ఆఫర్లు వచ్చినట్లు అటార్నీ జనరల్ వెల్లడించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, 20 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభుత్వ విధాన నిర్ణయమేనని,ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
వివరాలు
ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సరఫరా ప్రారంభించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
అయితే డిమాండ్, ఉత్పత్తి, ఇతర పరిస్థితులను బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుబాటులో ఉండే ఇథనాల్ పరిమాణం పెరగవచ్చని లేదా తగ్గవచ్చని వివరించారు. ఇక భారత్ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించిన గడువుకంటే ఐదేళ్ల ముందుగానే చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ సరఫరా ప్రారంభించాయి. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకుని, 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచడం ప్రభుత్వ తదుపరి లక్ష్యంగా నిర్ణయించింది.