Page Loader
ఆ ఆరు దేశాల  మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
కొత్త మార్గదర్శకాలు విడుదల

ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

వ్రాసిన వారు Stalin
Jan 02, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హై‌రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72గంటల ముందే ఆర్‌టీ‌పీసీఆర్ పరీక్షలను చేయించి నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని డిసెంబర్ 29న జారీ‌చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. హై‌రిస్క్ దేశాల జాబితాలో చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. తాజా మార్గదర్శకాల్లో కేంద్రం ఏం చెప్పిందంటే.. హై రిస్క్ దేశాల నుంచి నేరుగా రావడం మాత్రమే కాదు.. ఆ దేశాల గుండా వచ్చినా నెగిటివ్ రిపోర్టును 72 గంటల ముందే సమర్పించాలని స్పష్టం చేసింది.

కరోనా

జనవరి 1 నుంచి అమలు..

జనవరి 1వ తేదీ నుంచి ఆర్‌టీ పీసీఆర్ నెగిటివ్ సమర్పించే నిబంధనల అమలవుతోంది. అయితే విమానాశ్రయాల్లో చేసే 2శాతం రాండమ్ టెస్టులకు.. వీటికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. నెగిటివ్ రిపోర్టు సమర్పించిన వాళ్లకు కూడా భారతీయ విమానాశ్రయాల్లో రాండమ్ టెస్టులు జరుగుతాయని కేంద్రం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్‌లోనే భారీగా నమోదవుతున్నాయి. అందుకే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికలపై మరింత ఫోకస్ పెట్టాలని కేంద్రం ఆదేశించింది. హై రిస్క్ దేశాల నుంచి నేరు వచ్చే వారే కాకుండా.. ఆ దేశాల మీదుగా వచ్చే వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని చెప్పింది.