
Vijay: 'భరించలేని బాధలో ఉన్నా' .. తొక్కిసలాట ఘటనపై విజయ్ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రచార సభలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'నా హృదయం ముక్కలైంది. భరించలేని బాధలో ఉన్నాను. ఆ వేదనను మాటల్లో చెప్పలేను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నానని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.
Details
39 మంది మృతి
ఈ విషాదంలో 39 మంది మృతిచెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఒక్కసారిగా ఆయన దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించడంతో భారీ గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం కరూర్‌కు రావాల్సి ఉండగా సుమారు ఆరు గంటల ఆలస్యంగా చేరుకున్నారు. అంతేకాకుండా ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనసందోహం ర్యాలీలో పాల్గొనడం పరిస్థితి అదుపు తప్పడానికి కారణమైంది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.