TTD: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం.. తొలి మూడు రోజులు డిప్ టోకెన్ ఉన్నవారికే అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటినుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత నిత్య కైంకర్యాలు పూర్తైన అనంతరం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది. ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనాలు నిర్వహించిన తరువాతే సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎల్లుండి, అలాగే జనవరి 1 తేదీల్లో దర్శనం కోసం మొత్తం 1.89 లక్షల మంది భక్తులకు 'డిప్' విధానం ద్వారా టీటీడీ టోకెన్లు కేటాయించింది. రేపటినుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ డిప్ టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
Details
జనవరి 2 నుంచి టోకన్లు లేకుండా సర్వదర్శనానికి అనుమతి
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో జనవరి 8 వరకు తిరుపతిలో టైం స్లాట్ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. అయితే జనవరి 2 నుంచి ఎటువంటి టోకెన్లు లేకుండా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. టోకెన్లు లేకపోయినా ఇవాళ, రేపు తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసిన టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టోకెన్లు లేని భక్తులకు మూడు రోజుల పాటు దర్శనానికి అనుమతి ఉండదన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రచారం నిర్వహిస్తోంది. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం తిరుమల, తిరుపతిలో దాదాపు 2 వేల మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందిని మోహరించినట్లు టీటీడీ తెలిపింది.