Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం
అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ నాగా నేషనల్ కౌన్సిల్(ఎన్‌ఎన్‌సీ) మాజీ మిలిటెంట్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. మాజీ సహచరుడు జరిపిన కాల్పుల్లో మాజీ తిరుగుబాటుదారుడు గైడిన్‌చుంగ్‌పో రోంగ్‌మీ(56) చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. జిరిఘాట్‌లోని రోంగైజన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఆర్థిక విభేదాలపై చర్చించేందుకు సమావేశమైన సమయంలో గైడిన్‌చుంగ్‌పో రోంగ్‌మీపై ఆయన మాజీ సహచరుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అసోం డీఐజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత కుమార్ భుయాన్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరొకరికి గాయాలైనట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు.